ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Grievances: లక్షల సంఖ్యలో ఫిర్యాదులు.. స్పందనకు అదనంగా 'జగనన్నకు చెబుదాం' - public grievances completely failing

public grievances failing : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం లక్షల సంఖ్యలో ఫిర్యాదులు స్వీకరిస్తున్నా వాటిని పరిష్కరించటంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమవుతోంది. ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి లక్షల సంఖ్యలో ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఫిర్యాదులన్నింటినీ పరిష్కరించేసినట్టు ప్రభుత్వం ప్రకటిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యాన అధికార యంత్రాంగం.. స్పందన కార్యక్రమంతో పాటు కొత్తగా 'జగనన్నకు చెబుదాం' పేరిట మరో ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం చేపట్టనుంది.

Etv Bharat
Etv Bharat

By

Published : May 2, 2023, 6:54 PM IST

public grievances failing : ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు పూర్తిగా విఫలం అవుతున్నాయి. నాలుగేళ్లుగా ప్రభుత్వం చేపట్టిన స్పందన కార్యక్రమంతో ఏమాత్రం ఉపయోగం లేకపోవటంతో కొత్తగా జగనన్నకు చెబుదాం పేరిట మరో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ సోమవారం చేపట్టిన స్పందన కార్యక్రమానికి లక్షల సంఖ్యలోనే ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, మండల స్థాయి అధికారులు, గ్రామవార్డు సచివాలయాలు ఇలా గ్రామ స్థాయి వరకూ ప్రజల నుంచి లక్షల సంఖ్యలోనే ఫిర్యాదులు వచ్చాయి. ప్రజలు తమ ఫిర్యాదుల కోసం గ్రామ వార్డు సచివాలయాలతో పాటు 1902 కాల్ సెంటర్, మొబైల్ యాప్, వెబ్ సైట్ లేదా కలెక్టరేట్లను సంప్రదించొచ్చని ప్రభుత్వం ప్రకటించింది.

కాల్ సెంటర్లు.. సాధారణ ఫిర్యాదులకు 1902 కాల్ సెంటర్, అవినీతి, ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం తదితర అంశాలకు 14400 కాల్ సెంటర్, రైతు భరోసా కు సంబంధించిన ఫిర్యాదులకు 1907, మద్యం తదితర అంశాలపై 14500 కాల్ సెంటర్, 14417 లో విద్యా సంబంధమైన అంశాలపై ఫిర్యాదు చేయాలని సూచించింది. 2019 నుంచి దాదాపు 34 లక్షల 50 వేల 419 ఫిర్యాదులు అందితే అందులో 34 లక్షల 06 వేల 766 ఫిర్యాదులు పరిష్కరించేసినట్టు ప్రభుత్వం ప్రకటించేసింది. కేవలం 22, 541 ఫిర్యాదులు మాత్రమే ఇంకా ప్రాసెస్ లో ఉన్నట్టు ప్రభుత్వం నిర్వహిస్తున్న స్పందన పోర్టల్ పేర్కొంటోంది.

ఎమ్మెల్యేలు చెబితేనే పరిష్కారం.. వాస్తవానికి మండల కేంద్రాల్లో తహసిల్దార్లు ప్రజలకు సంబంధించిన ఫిర్యాదులను పట్టించుకోకపోవటం, పాలనా పరంగా జరగాల్సిన అంశాలు కూడా ఎమ్మెల్యేలు చెబితే మాత్రమే ఫిర్యాదులు పరిష్కారం అవుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన రీసర్వేలో వ్యక్తం అవుతున్న అభ్యంతరాల పైనా మంత్రుల కమిటీ నిర్వహించిన సమీక్షలో ప్రస్తావనకు వచ్చిందంటే పరిస్థితి ఏమిటో అర్థం అవుతోంది. మండలస్థాయిలోనే పరిష్కరించాల్సిన ఈ అభ్యంతరాలు, వివాదాలను స్థానిక ప్రజాప్రతినిధులు చెబితే తప్ప చేయటం లేదన్న విమర్శలు వస్తుండటంపై సీనియర్ మంత్రులు ఈ సమీక్షలో అధికారుల తీరును తప్పు పట్టినట్టు సమాచారం. జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిస్థితుల నివేదిక కోరినా మండలస్థాయి నుంచి నివేదించాల్సిన తహసిల్దార్లు పట్టించుకోవటం లేదని తెలుస్తోంది. కేవలం స్థానిక ఎమ్మెల్యేలు చెబితే మాత్రమే సదరు అంశాలపై దృష్టిపెడుతున్నట్టు సమాచారం. దీంతో ఫిర్యాదులు గుట్టలు గుట్టలుగా పేరుకు పోతున్నాయి.

కొత్తగా జగనన్నకు చెబుదాం... ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం మరో ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం చేపట్టటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. స్పందన కార్యక్రమంలో పరిష్కృతం కాని ఫిర్యాదులు జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా ఏం పరిష్కృతం అవుతాయని సందేహాలు ప్రజల్లో నెలకొన్నాయి. ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, నారా లోకేశ్ ప్రజల్లో తిరుగుతూ వారి నుంచి పెద్ద ఎత్తున వినతులు స్వీకరిస్తుండటంతో పాటు గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన జనవాణి కార్యక్రమం చేపట్టారు. వీటికి కౌంటర్ గానే వైసీపీ ప్రభుత్వం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలుస్తోంది. మే 9 న జగనన్న కు చెబుదాం కార్యక్రమాన్ని చేపట్టనున్న ప్రభుత్వం ఫిర్యాదుల పరిష్కారం కోసం స్పందనకు కేటాయించిన 1902 హెల్ప్ లైన్ నెంబరునే దీనికోసమూ పెట్టింది. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో పర్యవేక్షణ యూనిట్లు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్లే ఈ కార్యక్రమాన్ని కూడా చూడాలని పేర్కోన్నారు. ఈ కార్యక్రమం అమలును మాత్రం సీఎం కార్యాలయం పర్యవేక్షిస్తుందని స్పష్టం చేశారు. నిర్ణీత కాలపరిమితిలో ఫిర్యాదులు పరిష్కరించాలని సూచించారు.

స్పందనలో ఫిర్యాదులు చేసినా ఉపయోగం లేదని భావిస్తున్న ప్రజలు ఇప్పటికే ప్రతిపక్షాల నేతలకు తమ గోడు వెళ్లబోసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో స్పందన తరహాలోనే ఏర్పాటు చేసిన కొత్త ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం జగనన్నకు చెబుదాం మరో ప్రహసనంగా మారుతుందని విమర్శలు వినవస్తున్నాయి.

ఇవీ చదవండి :

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details