ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాసుపుస్తకాల జారీ విధానం అస్తవ్యస్తం.. సకాలంలో అందక రైతుల ఇక్కట్లు - The process of issuing pass books was made chaotic.

రాష్ట్రంలో పట్టాదారు పాసు పుస్తకాల జారీ విధానం అస్తవ్యస్తంగా తయారైంది. వీటి పంపిణీలో రెవెన్యూ సిబ్బంది కొందరు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. పాసుపుస్తకాలు లేక రైతులు బ్యాంకు రుణాలను, ఇతర ప్రయోజనాలను పొందలేకపోతున్నారు.

పాసుపుస్తకం
పాసుపుస్తకం

By

Published : May 9, 2022, 5:42 AM IST

రైతులు అత్యంత ప్రాధాన్యంగా భావించే పట్టాదారు పాసు పుస్తకాల జారీ విధానం అస్తవ్యస్తంగా తయారైంది. వారు నెలలకొద్దీ నిరీక్షిస్తున్నా ఈ పుస్తకాలు అందడం లేదు. భూయాజమాన్య హక్కులను నిర్ధారించే వీటి పంపిణీలో రెవెన్యూ సిబ్బంది కొందరు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. వీటి కోసం ఎందరు దరఖాస్తు చేశారు? ఎన్ని వస్తున్నాయి? ఇవ్వకుంటే కారణాలేమిటన్న దానిపై పారదర్శకత లోపించింది. పాసుపుస్తకాలు లేక రైతులు బ్యాంకు రుణాలను, ఇతర ప్రయోజనాలను పొందలేకపోతున్నారు.

తహసీల్దార్‌ కార్యాలయాల సిబ్బంది దాటవేత ధోరణి రైతులను వ్యయప్రయాసలకు లోనుచేస్తోంది. ఓపిక లేకుంటే మరోసారి దరఖాస్తు చేసుకోవాలని వారు ఉచిత సలహాలిస్తున్నారు. సమస్య మూలాలను గుర్తించి పరిష్కరించే దిశలో క్షేత్రస్థాయినుంచి ఉన్నతాధికారుల వరకు దృష్టి పెట్టడం లేదు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఇతర జిల్లాల్లో ఈ పుస్తకాలు సకాలంలో రైతులకు అందడం లేదు. వీటిని చెన్నైలో ముద్రిస్తున్నారు. మీసేవలో ఫీజు కట్టి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశాక వివరాలు తహసీల్దార్‌ లాగిన్‌లోకి చేరుతాయి. ఈ వివరాల్లో ప్రధానంగా ఉండే 1బి, అడంగళ్‌లను పరిశీలించాక తహసీల్దార్లు ఆన్‌లైన్‌లో ఆమోదిస్తారు. ఈ వివరాలు చెన్నైకి చేరుతాయి. అక్కడ ముద్రించి 15రోజుల్లోగా పాసుపుస్తకాన్ని రైతులకు అందించాలి. ఆచరణలో ఇవేవీ అమలవడం లేదు. ముద్రణ సంస్థకు వెళ్లాక ఫొటోలు సక్రమంగా లేవని, ముద్రణకు తగ్గట్టు కాగితాలు లేవని, పేర్లు కనిపించడం లేదంటూ ఆన్‌లైన్‌లోనే వస్తున్న ఫిర్యాదులపై తహసీల్దార్‌ కార్యాలయంలో స్పందించే వారుండటం లేదు. ఆన్‌లైన్‌లో సరైన ప్రశ్నావళి లేనందునే తిరుగు సమాధానం పంపలేకపోతున్నామని తహశీల్దార్‌ కార్యాలయాల సిబ్బంది చెబుతున్నారు. చెన్నై ముద్రణ సంస్థలో కాగితం కొరత, యూనిక్‌ నెంబరు కేటాయింపుపరంగా సమస్యలున్నందున పుస్తకాల పంపిణీ సవ్యంగా లేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు.

తహసీల్దార్లకు అవకాశమేదీ?
కొన్నిచోట్ల తహసీల్దార్‌ కార్యాలయంనుంచి ఆన్‌లైన్‌లో వివరాలు పంపేటప్పుడు ఆపరేటర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. చెన్నై ముద్రణ సంస్థకు కొన్ని వివరాలు వెళ్లడం లేదనే విమర్శలున్నాయి. ముద్రణ సంస్థకు పంపాక ఏర్పడుతున్న జాప్యంపై అడిగేందుకు తహసీల్దార్లకు అవకాశం లేదు. ఆన్‌లైన్‌లోనే ప్రక్రియ సాగడం దీనికి కారణం. దీనిపై సీనియర్‌ ఎమ్మార్వో ఒకరు మాట్లాడుతూ.. ‘కొందరికి కాస్త ఆలస్యంగానైనా పుస్తకాలు అందుతున్నాయి. రెండు నెలలయ్యాక పాసుపుస్తకం రానట్లయితే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నాం. అంతకుమించి ఏమీ చేయలేం’ అని నిస్సహాయత వ్యక్తం చేశారు. మరోవైపు.. సరైన చిరునామాలు లేక, చిరునామా నమోదులో పొరపాట్ల వల్ల చెన్నైనుంచి పాసు పుస్తకాలు నేరుగా దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లడం లేదు. తహసీల్దార్‌ కార్యాలయానికి పంపుతున్న పుస్తకాల గురించి రైతులకు తెలియడం లేదు. ఇవి సంబంధిత వీఆర్వోలకు అందుతున్నాయి. వీటిని ఇచ్చేందుకు రైతులనుంచి కొందరు వీఆర్వోలు దండుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. పాసుపుస్తకం పంపిణీపై వచ్చే సెల్‌ సందేశాన్ని చాలా మంది రైతులు గుర్తించడం లేదు. ఏసీబీ అధికారులు విశాఖలోని పలు తహశీల్దార్‌ కార్యాలయాల్లో తనిఖీ చేసినప్పుడు పాసుపుస్తకాలు భారీగా కనిపించాయి. నెల్లూరు జిల్లా ఇందుకూరు మండలంలో ఇటీవల ఓ వ్యక్తి లేని పొలానికి రెండుసార్లు పట్టాదారు పాసుపుస్తకాలు పొందడం గమనార్హం. చెన్నైలోని ముద్రణ సంస్థ నుంచి తపాలాశాఖ ద్వారా రైతులకు నేరుగా పుస్తకాలు బట్వాడా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని సీనియర్‌ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:తెరాస నన్ను చంపించడానికి ప్రయత్నిస్తోంది: కేఏ పాల్‌

ABOUT THE AUTHOR

...view details