భక్తుల పాలిట కొంగుబంగారం బెజవాడ కనకదుర్గమ్మ. అలాంటి అమ్మవారి సేవలో తరించేందుకు భక్తులు భవానీ దీక్ష ధరించి అమ్మలగన్నయమ్మను భక్తితో కొలిచారు. దీక్షను ముగించిన భక్తులంతా ఇప్పుడు విరమణ కోసం ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు. అమ్మ సన్నిధిలో ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో దీక్షను విరమిస్తారు. దుర్గమ్మ అంతరాలయం నుంచి తీసుకువచ్చిన అగ్నిహోత్రంతో హోమగుండాలను వెలిగించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఈవో సురేష్ బాబు, స్థానాచార్యులు, ప్రధాన అర్చకులు ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు.
భవానీ దీక్షా విరమణోత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు తరలివస్తారు. రైలు, బస్సు మార్గాలతో పాటు చాలామంది కాలినడకన కూడా అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. మొక్కులు తీర్చుకునే భవానీలు ఇంద్రకీలాద్రి చుట్టూ గిరిప్రదక్షిణలో పాల్గొని... అనంతరం అమ్మవారిని దర్శించుకుంటారు. ఇరుముడి కుండీల వద్ద గురుభవానీల ఆధ్వర్యంలో దీక్షను విరమిస్తున్నారు.