Yuvagalam Padayatra : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం గార్లదిన్నెలో ఘన స్వాగతం లభించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చారు. తనని కలవడానికి వచ్చిన యువత, మహిళలు, వృద్ధులను కలుస్తూ లోకేశ్ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే బీసీలకు శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు ఇస్తామని.., బీసీలకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో బీసీలకు తెలుగుదేశం ఏం చేసిందనేది చర్చకు తాను సిద్ధమని.., వైఎస్సార్సీపీ నేతలు సిద్ధమా అని లోకేశ్ సవాల్ విసిరారు.
జగన్ ఎస్ఎస్సీ ఫెయిల్... నువ్వే నా నమ్మకం, నువ్వే నా భవిష్యత్తు, జగన్ కి చెబుదాం.. అంటూ కొత్త కొత్త పేర్లతో జగన్ ముందుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ పేరు దొంగ మోహన్ అని.. ఆయన పదవ తరగతి ఫెయిల్ అని విమర్శించారు. అందుకే గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో దొంగ మోహన్ ఓటు వేయలేక పోయాడని దుయ్యబట్టారు. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. నియోజకవర్గంలో అందుబాటులో ఉండరని, ఐదు రోజులు బెంగళూరులో, రెండు రోజులు అనంతపురంలో ఉంటారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే భర్త సాంబశివారెడ్డి 500 ఎకరాల స్థలాన్ని కాజేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే, ఆమె భర్త ఇసుక, మట్టిని దోచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గంజాయి వద్దు బ్రో... యువగళం పాదయాత్రకు శింగనమల నియోజకవర్గంలో భారీ స్పందన వస్తోంది. శుక్రవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కావటంతో.. యువత ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ పాదయాత్ర నిర్వహించారు. గంజాయి వద్దు బ్రో అంటూ ముద్రించిన టీషర్టులు, టోపీలు పెట్టుకొని యువత పెద్దఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు. రాష్ట్రం గంజాయి అంధ్రప్రదేశ్ గా మారిపోయిందని, యువత ప్రజలు అప్రమత్తగా ఉండాలని మాదక ద్రవ్యాలకు బానిసలు కావద్దని లోకేశ్ కోరారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాదయాత్రకు సంఘీభావం తెలిపి లోకేశ్‌తో కలిసి నడవటం టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
బాలకృష్ణతో కలిసి సెల్ఫీలు.. తన మామ నందమూరి బాలకృష్ణతో కలిసి మర్తాడు నుంచి పాదయాత్ర ప్రారంభించిన లోకేశ్.. మార్గమధ్యంలో మహిళలు, యువతకు సెల్ఫీలు ఇస్తూ అడుగులు వేశారు. బాలకృష్ణ దాదాపు రెండు కిలోమీటర్లు పైగా పాదయాత్రలో పాల్గొని యువత, మహిళలను పలకరిస్తూ, వారికి సెల్ఫీలు ఇస్తూ ముందుకు సాగారు. యువగళం దెబ్బకు జగన్ కు భయం పుట్టుకుందని నారా లోకేశ్ విమర్శించారు.