Conference of Dalit Associations : వైఎస్సార్సీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీలకు గతంలో ఎప్పుడూ లేనంతగా అన్యాయం జరుగుతోందని దళిత నేతలు, నాయకులు గళమెత్తారు. రాజ్యాంగపరంగా లభించిన హక్కులనూ పొందలేని పరిస్ధితి ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ముందుగా ఎస్సీలనే వంచించారంటూ మండిపడ్డారు. విజయవాడ వేదికగా జగన్ పాలనలో దళితులపై దాడులు- ప్రభుత్వ వైఫల్యాల అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం చేపట్టారు. తెలుగుదేశం నేత వర్ల రామయ్య ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.
తీవ్ర అన్యాయం.. జగన్ ప్రభుత్వంలో మాలలు, మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎంఆర్పీఎస్) నాయకుడు మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎ జగన్ దళితులను వంచించాడని ఆయన ఆరోపించారు. జగన్ పాలనలో దళితులపై దాడులు అంశంపై విజయవాడలోని ఐలాపురం హోటల్లో టీడీపీ ఆధ్వర్యాన నిర్వహించిన సదస్సులో మందకృష్ణ మాట్లాడారు. నాలుగేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో దళితులపై 8 వేల దాడులు జరిగాయని.. అభివృద్ధిలో ఎస్సీలు 25ఏళ్లు వెనక్కివెళ్లి పోయారని విచారం వ్యక్తం చేశారు. ఏపీలో జరుగుతున్న దారుణాలు కలవరపెడుతున్నాయని, దళితులు కేసులు పెట్టినా పోలీసులు పట్టించుకోవడం లేదని మందకృష్ణ పేర్కొన్నారు. దళితులు హత్యకు గురవుతున్నా కేసులు నమోదు కావడం లేదని చెప్తూ.. దళితుల రక్షణ కోసమైనా జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు మళ్లించిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని, నిధులు పక్కదారి పట్టించిన అధికారులపై అట్రాసిటీ కేసు పెట్టాలని అన్నారు. మాల, మాదిగ, రెల్లి వర్గాల మధ్య అసమానతలు లేకుండా చూడాలని కోరారు.
కచ్చితమైన ప్రకటనలు చేసేవారినే నమ్ముతాం.. చంద్రబాబుతో తనకున్న అనుబంధం కొద్దీ.. తాను నేను ఏం మాట్లాడినా టీడీపీ మనిషిని అనేవారని మందకృష్ణ తెలిపారు. ఎస్సీ వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిపై చర్యలు లేవని అసహనం వ్యక్తం చేశారు. కచ్చితమైన ప్రకటన చేసే నేతలనే తాము నమ్ముతామని, ఎస్సీలపై దాడి చేస్తే తీవ్ర చర్యలుంటాయని చంద్రబాబు ప్రకటించాలని మందకృష్ణ డిమాండ్ చేశారు.