ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్‌ఈసీగా తగినవారా అనే సందేహం కలుగుతోంది : హైకోర్టు - The High Court Of Ap is furious with the SEC over the Parishad elections

సుప్రీం తీర్పును అర్థం చేసుకోవడంలో ఎస్​ఈసీ విఫలం.. హైకోర్టు తీవ్ర ఆగ్రహం
సుప్రీం తీర్పును అర్థం చేసుకోవడంలో ఎస్​ఈసీ విఫలం.. హైకోర్టు తీవ్ర ఆగ్రహం

By

Published : May 21, 2021, 5:21 PM IST

Updated : May 22, 2021, 3:43 AM IST

15:25 May 21

ఎస్ఈసీపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

   రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ) నీలం సాహ్నిపై రాష్ట్ర హైక్టోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్‌ విధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు నీలం సాహ్ని అది గరిష్ఠ సమయమని అంటూ వక్రభాష్యం చెప్పారు. ఆ విధంగా అర్థవివరణ చేయడం ఉద్దేశపూర్వమైంది కాక మరొకటి కాదు. అలాంటి వక్రభాష్యాలను ఆమోదించలేం. ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పులో అంత స్పష్టంగా చెప్పాక ఈ రకమైన భాష్యాలను ఆమోదించే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎన్నికల కమిషనర్‌ చర్యలను సమర్థిస్తూ ఎస్‌ఈసీ కార్యదర్శి ఇచ్చిన వివరణ ఆమోదయోగ్యం కాదు. పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు కోడ్‌ విధించాలని సుప్రీంకోర్టు తీర్పు చాలా స్పష్టంగా ఉంది. ఆంగ్ల భాషను చదవడం, రాయడం, అర్థం చేసుకోగలిగే సామాన్యులకు.. సుప్రీంకోర్టు మార్గదర్శనం ఇట్టే అర్థం అవుతుంది. రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా చేసిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారిణి ఇప్పుడు ఎన్నికల కమిషనర్‌గా పనిచేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఇంత సాధారణ ఆదేశాలను సరైన కోణంలో ఆమె అర్థం చేసుకోలేకపోయారు. దీన్నిబట్టి చూస్తే ఎన్నికల కమిషనర్‌గా ఆమె తగినవారా, అర్హత కలిగినవారా అనే సందేహం తలెత్తుతోంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తి  శుక్రవారం ఇచ్చిన తీర్పులో ఈ వ్యాఖ్యలు చేశారు.  

  • ఆమె ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన నాడే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సారాంశం ఏమి చెబుతోందో గ్రహించకుండా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఆమె అర్థం చేసుకున్న విధానం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉందనేది నిర్వివాదాంశాం. కోడ్‌ కాలపరిమితికి భిన్నంగా కేవలం 10 రోజులు మాత్రమే కోడ్‌ చాలనే విధంగా నోటిఫికేషన్‌ జారీచేశారు. ఇది పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు ఉండాలనే స్ఫూర్తికి విఘాతంలా మారింది.
  • ఎస్‌ఈసీ చర్యలు ప్రజాస్వామ్య విలువలను నాశనం చేసేవిగా/ దిగజార్చేవిగా ఉన్నాయి. అంతేకాక ఆ చర్యలు ప్రజాస్వామ్యాన్ని ఉద్దేశపూర్వకంగా బలహీన పరిచే, నిరంకుశమైనవిగా వర్ణించవచ్చు. ఇది ప్రజాస్వామ్య హుందాతనాన్ని క్రమంగా తగ్గించడమే. తద్వారా రాష్ట్రం ప్రజాస్వామిక లక్షణాలను కోల్పోయి నిరంకుశ పాలన దిశగా అడుగులు పడతాయి. ప్రభుత్వ చర్యల కారణంగా రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థలు నిర్వీర్యమైతే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థల సమర్థత, సుస్థిరతను గత కొంత కాలంగా రాజకీయ శక్తులు ప్రశ్నిస్తున్నాయి. ప్రజాస్వామ్య ప్రమాణాలు దిగజారడానికి  కార్యనిర్వాహక అధికార విస్తృతి పెరగడమే కారణం. అధికారాల విస్తృతి పెరిగితే న్యాయ మార్గాల్లో, వ్యవస్థీకృత మార్పులు చేసి రాజకీయ నాయకులకు ప్రజాస్వామ్య మద్దతు ఉందని చూపించేలా చేయడమే అవుతుంది.
  • పత్రికా స్వేచ్ఛను హరించడం, చట్టబద్ధ పాలనను బలహీనపరచడం, న్యాయవ్యవస్థ స్వతంత్రతను బెదిరించడం కార్యనిర్వాహక విస్తృతికి కొన్ని ఉదాహరణలు. ఎన్నికల సమయంలో వ్యూహాత్మక వేధింపులు, ఎన్నికలను స్వేచ్ఛగా నిర్వహించకపోవడం, మీడియాను నిషేధించడం, ప్రతిపక్ష నేతలను అనర్హులుగా ప్రకటించడం, ఎన్నికల పరిశీలకులకు రిగ్గింగు, చట్ట ఉల్లంఘనలు జరిగినట్లు కనిపించకుండా చేయడం కూడా ప్రజాస్వామ్య ప్రమాణాలు దిగజార్చడంలో భాగమే. ప్రస్తుత కేసులోనూ ఎస్‌ఈసీ/ప్రభుత్వ చర్యలు ప్రజాస్వామ్య ప్రమాణాలను దిగజార్చేవిగా ఉన్నాయే తప్ప మరొకటి కాదు.     
  • సాధారణంగా ఐఏఎస్‌లు నిష్పాక్షికంగా వ్యవహరిస్తారని అందరూ భావిస్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా అలాంటి వ్యక్తులను నియమిస్తారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సారాంశాన్ని వివిధ కారణాల వల్ల ఎన్నికల కమిషనర్‌కు అర్థం కాలేదని భావించాల్సి వస్తోంది.
  • సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను ఎస్‌ఈసీ భేఖాతరు చేశారు. సుప్రీం ఆదేశాలకు జీవం లేకుండా చేశారు. కాబట్టి ఎన్నికల సంఘం వాదనను తిరస్కరిస్తున్నాం. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు స్పష్టం చేస్తున్నాం. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.
  •  రాష్ట్ర ఎన్నికల సంఘం చట్టబద్ధ పాలనకు కట్టుబడి వ్యవహరిస్తుందని అందరమూ భావిస్తాం. కానీ ఎన్నికల కమిషనర్‌ తీరు సుప్రీంకోర్టు ఉత్తర్వులను అగౌరవ పరిచేదిగా ఉంది. ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేస్తునాం’ అని తీర్పులో పేర్కొన్నారు.

ఇవీ చూడండి :ఎంపీ రఘురామకృష్ణరాజుకు బెయిల్‌ మంజూరు

Last Updated : May 22, 2021, 3:43 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details