ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

EBC Reservation : రిజర్వేషన్లపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి.. కోర్టులతో జాప్యం తప్పదు : హైకోర్టు - కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు

EBC Reservation : ఈబీసీ రిజర్వేషన్ల అమలు అంశం సున్నితమైనదని హైకోర్టు అభిప్రాయ పడింది. ఈ విషయంలో కోర్టుల కంటే ప్రభుత్వాలపై ఇతర మార్గాల్లో ఒత్తిడి తీసుకురావాలని సూచించింది. కోర్టులో పెండింగ్ ఉందన్న సాకుతో ప్రభుత్వాలు తప్పించుకునే ప్రయత్నం చేస్తాయని వ్యాఖ్యానించింది. కాపులకు 5శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గత టీడీపీ ప్రభుత్వం చట్టం చేయగా వాటి అమలు, రద్దుపై దాఖలైన వేర్వేరు వ్యాజ్యాలను లోతుగా విచారించాల్సి ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది.

Etv Bharat
Etv Bharat

By

Published : Apr 27, 2023, 11:36 AM IST

EBC Reservation: ఆర్థికంగా వెనుకబడిన(ఎకనామిక్ బ్యాక్​వర్డ్ క్లాస్) వర్గాలకు కేటాయించిన 10% కోటాలో కాపులకు 5% రిజర్వేషన్‌ అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలు చేసిన వ్యాజ్యాలను ఉపసంహరించుకోవాలని హైకోర్టు సూచించింది. రిజర్వేషన్ల అమలు సున్నితమైన వ్యవహారమని పేర్కొన్న హైకోర్టు.. రిజర్వేషన్‌ అమలు కోసం ఇతర మార్గాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని తెలిపింది. కోర్టులో వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయనే కారణంతో రిజర్వేషన్ అమలు చేసే విషయంలో ప్రభుత్వం జాప్యం చేసే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని తాము భావిస్తున్నామని హైకోర్టు పేర్కొంది. కాపుల రిజర్వేషన్‌ అమలు కోసం, వాటిని వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో లోతైన విచారణ చేయాల్సిన అవసరం ఉందని తెలిపిన కోర్టు... కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వేసవి సెలవుల తర్వాత విచారణ చేస్తామంటూ.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది.

హైకోర్టులో పిల్ దాఖలు.. ఈడబ్ల్యూఎస్‌ కోటా 10 శాతంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్రం కల్పించిన 10శాతం రిజర్వేషన్లో 5 శాతం కాపులకు కేటాయిస్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేసేలా ఆదేశించాలని కోరారు. ఇదే వ్యవహారంపై మరికొన్ని వ్యాజ్యాలు దాఖలయ్యాయి.

కాపులకు 5 శాతం రిజర్వేషన్లు.. తాజాగా జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలు వినిపిస్తూ.. గత ప్రభుత్వ హయాంలో ఈడబ్ల్యూఎస్‌ వాటాలో 5 శాతం రిజర్వేషన్లను కాపులకు కేటాయిస్తూ యాక్ట్‌ 14/2019ని తీసుకొచ్చారన్నారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరగా ఆ చట్టాన్ని సమర్థించిందన్నారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ చేసిన చట్టం చెల్లుబాటు అవుతుందని చెప్పిందని గుర్తుచేస్తూ.. ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల ప్రవేశాల్లో కాపులకు రిజర్వేషన్‌ కల్పించేలా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. మరో న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపించారు. ఈడబ్ల్యూఎస్‌ 10శాతం కోటాలో ఒక సామాజిక వర్గానికే 5 శాతం రిజర్వేషన్‌ కల్పించడానికి వీల్లేదన్నారు. గత ప్రభుత్వం 5 శాతం కాపులకు రిజర్వేషన్‌ కల్పిస్తూ తీసుకొచ్చిన యాక్ట్‌ 14/2019ని సవాలు చేస్తూ 2019లో పిల్‌ వేశామని తెలిపారు. కౌంటర్‌ దాఖలు చేయడానికి సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది సుమన్ కోరారు. ఈ వ్యవహారంలో కీలక అంశాలు ఇమిడి ఉన్నందున లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉందని పేర్కొన్న హైకోర్టు విచారణను వాయిదా వేసింది.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details