ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP High Court అగ్రిగోల్డ్‌ కేసు విచారణ ఈ నెల 31కి వాయిదా! నెల్లూరు అటవీ భూములపై యథాస్థితి..: హైకోర్టు - సీఐడీ

High Court hearing on Agrigold property dispute: అగ్రిగోల్డ్‌ ఆస్తుల జప్తు వివాదంపై దాఖలైన వ్యాజ్యాలన్నింటిపై హైకోర్టు విచారణ జరిపింది. ఈడీ తరఫు వాదనల కోసం విచారణను ఈనెల 31కి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. ఇదిలా ఉండగా.. నెల్లూరులోని రిజర్వు ఫారెస్ట్‌ పరిధిలోని 40 ఎకరాలను రాష్ట్ర గృహనిర్మాణ సంస్థకు అప్పగించడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. యథాస్థితి కొనసాగించాలని ఆదేశించింది.

అగ్రిగోల్డ్‌ ఆస్తుల జప్తు వివాదంపై హైకోర్టు విచారణ
అగ్రిగోల్డ్‌ ఆస్తుల జప్తు వివాదంపై హైకోర్టు విచారణ

By

Published : Jul 28, 2023, 1:42 PM IST

High Court hearing on Agrigold property dispute: అగ్రిగోల్డ్‌ ఆస్తుల జప్తు వివాదంపై హైకోర్టు విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం/సీఐడీ తరఫున ఏజీ వాదనలు ముగియడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తరఫు న్యాయవాది వాదనల కోసం విచారణ సోమవారానికి వాయిదావేస్తూ.. న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి ఉత్తర్వులిచ్చారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులు కొన్నింటిని ఈడీ జప్తు చేయడాన్ని సవాలు చేస్తూ ఆ సంస్థ యాజమాన్యంహైకోర్టులో రెండు వ్యాజ్యాలు వేసింది.తాము రుణం ఇచ్చాము కాబట్టి ఆ ఆస్తులను వేలం వేసి విక్రయించుకునే హక్కు మాదేనని కొన్ని బ్యాంక్‌లు మూడు వ్యాజ్యాలు వేశాయి.

ఆస్తులను జప్తు చేస్తూ సీఐడీ, ఈడీ వేర్వేరుగా ఇచ్చిన ఉత్తర్వులను బ్యాంక్‌లు సవాలు చేశాయి. అగ్రిగోల్డ్‌కు చెందిన కొన్ని ఆస్తులను బ్యాంక్‌ వేలం వేయగా తాను కొనుగోలు చేశానని, దానిని జప్తు చేయడానికి వీల్లేదని ఓ వ్యక్తి వ్యాజ్యం వేశారు. ఆల్‌ ఇండియా అగ్రిగోల్డ్‌ కస్టమర్స్, ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ మరో వ్యాజ్యం వేస్తూ.. అగ్రిగోల్డ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి ముందే కొన్ని ఆస్తులు తాము కొనుగోలు చేశామని, వాటిని ఈడీ ఎటాచ్‌ చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. అగ్రిగోల్డ్‌ నుంచి కొనుగోలు చేసిన భూముల్లో నిర్మించుకున్న అపార్ట్‌మెంట్‌ను సైతం సీఐడీ జప్తు చేసిందని పేర్కొంటూ ఏలూరు ఫార్చ్యూన్‌ అపార్ట్‌మెంట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ హైకోర్టును ఆశ్రయించింది.

ఈ వ్యాజ్యాలన్నింటిపై హైకోర్టు విచారణ జరిపింది. రాష్ట్రప్రభుత్వం తరఫున ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడటం రాష్ట్రప్రభుత్వం విధి అన్నారు. ఏపీ డిపాజిటర్ల రక్షణ చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం/సీఐడీ ఆస్తులను జప్తు చేసిందన్నారు. ఆ ఆస్తులనే పీఎంఎల్‌ఏ చట్టం కింద ఈడీ జప్తు చేయడం సరికాదన్నారు. మొదట తామే జప్తు చేశామని, తర్వాత ఈడీ జప్తు చేసిందన్నారు. డిపాజిటర్లకు సొమ్ము తిరిగి చెల్లించేందుకు జప్తు చేసిన ఆస్తులపై ప్రథమ హక్కు రాష్ట్రానికే ఉంటుందన్నారు. అగ్రిగోల్డ్‌కు రూ.20వేల లోపు సొమ్ము చెల్లించిన డిపాజిటర్లకు ప్రభుత్వం ఇప్పటికే రూ.900 కోట్లు చెల్లించిందని చెప్తూ.. పీఎంఎల్‌ఏ, దివాలా చట్టంలో డిపాజిటర్ల ప్రయోజనాలు కాపాడేందుకు నిబంధనలు లేవని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏజీ డిపాజిటర్ల రక్షణ చట్టం కింద సీఐడీ చేసిన జప్తు చెల్లుబాటు అవుతుందన్నారు. ఏజీ వాదనలు ముగియడంతో ఈడీ తరఫు వాదనల కోసం విచారణను ఈనెల 31కి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.

మరో కేసు విచారణలో... రిజర్వు ఫారెస్ట్‌ పరిధిలోని కొండ ప్రాతానికి చెందిన 40 ఎకరాలను నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్లు నిర్మించేందుకు నెల్లూరు జిల్లా దగదర్తి తహసీల్దార్‌.. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థకు అప్పగించడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. ఈ భూమి విషయంలో యథాతథ స్థితి పాటించాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. పూర్తి వివరాలు సమర్పించాలని రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, నెల్లూరు జిల్లా కలెక్టర్, కావలి ఆర్డీవో, దగదర్తి మండల తహసీల్దార్, ఫారెస్ట్‌ చీఫ్‌ కన్జర్వేటర్, నెల్లూరు జిల్లా అటవీశాఖాధికారి, ఏపీ గృహనిర్మాణ సంస్థ కావలి కార్యనిర్వహణ ఇంజినీర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 2కు వాయిదా వేస్తూ.. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. దగదర్తి, కొత్తపల్లి కౌరుగుంట గ్రామాల పరిధిలో అటవీ భూమికి చెందిన 40 ఎకరాల్లో ఇళ్లు నిర్మించేందుకు దగదర్తి తహశీల్దార్‌.. గృహనిర్మాణ సంస్థకు అప్పగించడాన్ని సవాలు చేస్తూ ఎం.రవీంద్రబాబు హైకోర్టులో పిల్‌ వేశారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది సి.సుబోధ్‌ వాదనలు వినిపించారు.

ABOUT THE AUTHOR

...view details