The attitude of the authorities is controversial : రాష్ట్రంలో ఐపీసీ చట్టం అధికార పార్టీ వైఎస్సార్సీపీ చుట్టంలా మారిపోయింది.. అధికార పార్టీ పేరెత్తినా, ఆ పార్టీ నాయకులను విమర్శించినా ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోందని ప్రతిపక్షపార్టీలు ఆరోపిస్తున్నాయి. కాగా, ఇటీవల పలు శాఖల అధికారుల తీరు ప్రతిపక్షాల ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. అధికార పార్టీ నాయకులను ప్రసన్నం చేసుకోవడంలో ప్రత్యేకించి పోలీస్, రెవెన్యూ శాఖలు ముందుంటున్నాయి. ఆ రెండు శాఖల్లో పలువురు అధికారుల అత్యుత్సాహం అమాయకుల పాలిట శాపంగా మారింది.
అధికార పార్టీ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే.. ఊహించని కేసులు ఎదురవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలను దూషించారని, పోలీసుల విధుల్లో ఆటంకం కలిగించారని కేసుల్లో ఇరికిస్తున్నారని ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు. కొత్తకొత్త సెక్షన్లు వెతికి మరీ సంకెళ్లు వేస్తున్నారని చెప్తున్నారు. పోలీస్ శాఖ ఉన్నతాధికారులు సైతం అధికార పార్టీ అనుంగు అనుచరులుగా బాహాటంగా ప్రకటించుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు భూమి కొనుగోళ్లు, అమ్మకాల వ్యవహారాల్లో రెవెన్యూ అధికారులు ఇరుకున పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హైకోర్టు జోక్యంతో...గన్నవరానికి చెందిన టీడీపీ నేత జాస్తి వెంకటేశ్వరరావుకు చెందిన భూమిలో రెవెన్యూ అధికారుల జోక్యంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వెంకటేశ్వరావుకు చెందిన స్థలంలో జోక్యం చేసుకోవద్దని తేల్చిచెప్పింది. అధికారులు చట్టం నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ ఈమేరకు ఉత్తర్వులిచ్చారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం వెదురుపావులూరు గ్రామ పరిధిలోని సర్వేనంబరు 308/4లో తనకు ఉన్న 99 సెంట్ల భూమి విషయంలో రెవెన్యూ అధికారులు చట్టవిరుద్ధంగా జోక్యం చేసుకుంటున్నారని టీడీపీ నేత జాస్తి వెంకటేశ్వరరావు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఆయన తరఫున న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు.
వాస్తవాలు కోర్టుకు విన్నవించిన న్యాయవాది... 1999లోనే పిటిషనర్ తల్లి జాస్తి రాజేశ్వరమ్మ పేరుపై డీఫాం పట్టా ఇచ్చారని, అప్పటి నుంచి ఆ భూమి వారి స్వాధీనంలోనే ఉందని తెలిపారు. రికార్డుల్లో సైతం జాస్తి కుటుంబీకుల పేరు చేర్చారని, రాజకీయ నేతల ప్రోద్భలంతో ఆ భూమి విషయంలో రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకుంటున్నారని కోర్టుకు వెల్లడించారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా... ఆ భూమి ప్రభుత్వానికి చెందినదిగా పేర్కొంటూ గన్నవరం తహశీల్దార్ బోర్డు ఏర్పాటు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు సదరు భూమిలో అధికారులు ఏర్పాటు చేసిన బోర్డు, పిటిషనర్ పేరుపై రెవెన్యూ రికార్డుల్లో నమోదైన వివరాలను కోర్టుకు అందజేశారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని రెవెన్యూ అధికారుల జోక్యాన్ని నిలువరించాలని కోరారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పిటిషనర్ భూమి విషయంలో జోక్యం చేసుకోవద్దని, చట్ట నిబంధనలను పాటించాలని గన్నవరం తహశీల్దార్‌ను ఆదేశించారు.
ఇవీ చదవండి :