employee transfers : ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే 22 తేదీ నుంచి 31 తేదీ వరకూ బదిలీలకు అవకాశం ఇస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు వివిధ శాఖల ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు. ఒకే చోట ఐదేళ్లు పనిచేసిన ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అటు ఉద్యోగ సంఘ నేతలకు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు.
మార్గదర్శకాలు విడుదల.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. 2023 మే 22 నుంచి 31వ తేదీ వరకు బదిలీల ప్రక్రియను చేపట్టేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. 2023 ఏప్రిల్ 30వ తేదీ నాటికి ఒకే చోట 5 ఏళ్లు పనిచేసిన ఉద్యోగులకు బదిలీ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. నిర్దేశిత తేదీ నాటికి 2 ఏళ్ల పాటు ఒకే చోట పనిచేసిన వారు సైతం బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఉద్యోగుల బదిలీల్లో ముందుగా గిరిజన ప్రాంతాల్లోని పోస్టులను భర్తీ చేసిన అనంతరం ఇతర ప్రాంతాలపై దృష్టి పెడతామని ప్రభుత్వం పేర్కొంది.
ఆదాయార్జన శాఖలైన వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, రవాణా, వ్యవసాయ శాఖలు కూడా నిబంధనలకు అనుగుణంగానే మే 31 లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడిచే పాఠశాల విద్య, ఇంటర్, సాంకేతిక ఉన్నత విద్యా సంస్థల్లోని వారికి ఈ బదిలీల ప్రక్రియకు మినహాయింపును ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే ఉద్యోగ సంఘ నేతలకూ బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఒకేచోట పనిచేసిన సర్వీసు కాలం గడువును కూడా 9 ఏళ్లకు పెంచారు.