Father Raped Daughter: అమ్మకు ప్రతిరూపం ఆడపిల్ల. అందుకే ప్రతి ఇంటా ఆడపిల్ల ఉండాలంటుంటారు. తల్లిదండ్రులు.. కూతుళ్ల రూపంలో అమ్మను చూసుకుని మురిసిపోతుంటారు. మరి.. ఆ ఆడపిల్ల కష్టాలకు కన్నవాడే కారణమైతే..! రక్షణగా ఉండాల్సిన తండ్రి రాక్షసుడైతే..! ఆడించాల్సిన వాడి చేతుల్లో అల్లాడిపోయి గుండె పగిలేలా రోదిస్తోంది. మూడేళ్లుగా లైంగిక దాడికి గురవుతూ నిత్యం నరకం చూస్తోంది. వింటున్న ప్రతి ఒక్కరి కన్నీళ్లు తెప్పిస్తూ సభ్యసమాజం తల దించుకునేలా చేసిన ఈ అమానవీయ సంఘటన విజయవాడలో వెలుగులోకి వచ్చింది. తండ్రిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది.
మాచవరానికి చెందిన వ్యక్తికి భార్య, ఇద్దరు కూతుళ్లు. ప్రైవేటు ట్రావెల్స్‌లో కారు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉంటూ కూతుళ్లకు ధైర్యం చెప్పాల్సింది పోయి వారి పాలిట మృగంలా మారాడు. ఓ సారి భర్త చరవాణిలో పెద్ద కుమార్తె(13) నగ్న చిత్రాలను గమనించిన భార్య అతడిని నిలదీయగా బుకాయించాడు. అవి నిజమైన ఫొటోలు కాదంటూ వాటిని చరవాణి నుంచి తీసివేయటంతో భార్య ఊరుకుంది. భర్త ప్రవర్తన సరిగా లేకపోవటం.. అప్పటికే అనుమానంతో ఇద్దరు కూతుళ్లను జులై నుంచి గన్నవరంలోని ఒక వసతిగృహంలో ఉంచి చదివిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 7న ఇద్దరు కూతుళ్లు ఇంటికి వచ్చారు. పెద్ద కుమార్తె తనకు దూరంగా ఉంటుండటంతో తండ్రి ఆమెను బెల్ట్‌తో చావబాదాడు. అడ్డుకున్న భార్యను దుర్భాషలాడాడు. దాంతో పిల్లలిద్దరూ వసతిగృహానికి వెళ్లిపోయి తిరిగి పండుగ సెలవుల్లో 10వ తేదీన ఇంటికి వచ్చారు.