About G.O.number 1 : పౌరుల ప్రాథమిక హక్కులను హరిస్తున్న జీవో 1ను రద్దు చేయాలని కోరుతూ విపక్షాలు ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం అవుతున్నాయి. ఇందుకోసం ఈనెల 19న విజయవాడలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నాయి. అవసరమైతే చలో అసెంబ్లీకి కూడా పిలుపు ఇస్తామని జీవో నం1 రద్దు పోరాట ఐక్య వేదిక నేతలు తెలిపారు.
ఐక్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం :ప్రజాస్వామ్య హక్కులను, ప్రజలు శాంతియుతంగా చేపట్టే నిరసనలను కాలరాసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నం1 రద్దు చేయాలని విపక్షాలు, ప్రజా సంఘాల నేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు విజయవాడలో జీవో నం1 రద్దు పోరాట ఐక్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రజల వ్యతిరేకతను ఏమాత్రం గౌరవించకుండా రాజ్యాంగ వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తోందని వివిధ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వ్వవహరిస్తున్న తీరును ప్రతి పౌరుడు తీవ్రంగా ఖండిచాలని వారు కోరారు. జీవో 1ని ప్రభుత్వం రద్దు చేసే వరకు పోరాటం చేయాలని వారు పిలుపునిచ్చారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు :ఈనెల 19వ తేదీన మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్రవ్యాపిత సదస్సు నిర్వహిస్తున్నామని జీవో నం1 రద్దు పోరాట ఐక్య వేదిక కన్వీనర్ సుంకర రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. జీవో నంబర్ 1 విడుదల అప్రజాస్వామికని తెదేపా, కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాజ్యంగ వ్యవస్థలను తన గుప్పెట పెట్టుకుని రానున్న ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి జగన్ చూస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడితేనే ప్రజల మనుగడ సాధ్యపడుతుందన్న సంగతి ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ రాష్ట్రమంతా పాదయాత్ర చేశారని, ఇప్పుడు ఇతర పార్టీల నేతలు పాదయాత్రలు, శాంతియుత నిరసనలు తెలుపుతుంటే తట్టుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 1 పై విస్తృత ప్రజా వేదికను ఏర్పాటు చేసి ఉద్యమానికి అందరూ సిద్ధం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. జీవో 1 రద్దుపై ఏ ఉద్యమ కార్యాచరణ తీసుకున్న తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని పేర్కొన్నారు.
కేసులు పెట్టి వేధిస్తున్నారు.. : ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై నిరసన తెలియచేసే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. విపక్ష పార్టీలపై ఆ బాధ్యత మరింత ఉంటుంది, కానీ వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలపై గళం విప్పుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు దిగుతోంది. ప్రజల తరఫున పోరాటం చేస్తే ముందుస్తు అరెస్టులు చేయిస్తోంది. కేసులు పెట్టి వేధిస్తోందని విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఏపీని రాచరికంగా భావిస్తున్నారని, ప్రభుత్వానికి ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడినా తట్టుకోలేకపోతున్నారని విపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు.
అనేక ఆంక్షలు :జీవో 1లో ఏముంది అనేది ప్రజలకు తెలియకుండా ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై తప్పు ఎక్కడైనా సభలు, సమావేశాలు నిర్వహించుకోచ్చని ప్రభుత్వం చెబుతూనే ప్రజలపై అనేక ఆంక్షలు విధిస్తోందని చెబుతున్నారు. జీవో 1 పేరుతో ప్రతిపక్షాల గొంతు నొక్కుతుందని వాపోతున్నారు. స్వంత స్థలంలో నిరసన కార్యక్రమం చేసుకోవచ్చని చెప్పిన ప్రభుత్వం నిన్న గన్నవరంలో ఉపాధ్యాయులు శాంతియుత నిరసనలు తెలుపుతుంటే ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. జీవో 1 అనేది విపక్షాలకు, ప్రజా సంఘాలకు మాత్రమే వర్తిస్తుందని, అధికార పార్టీ నేతలు ఇష్టానుసారంగా సభలు నిర్వహించుకోవచ్చని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకువెళ్లకుండా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇటువంటి జీవోను తీసుకువచ్చిందని, ఇంతకంటే దారుణం మరోకటి ఉందన్నారు.
జీవోను రద్దు చేయాలని టీడీపీ పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తోంది. భారతదేశ చరిత్రలో స్వాతంత్య్రానంతరం జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రజాస్వామిక, రాజ్యాంగ హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతోంది. జీవో నంబర్ 1 అందుకు పరాకాష్టగా నిలుస్తోంది. సభలు, సమావేశాలు నిర్వహించుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది. అధికార పార్టీ సభ్యులకు అనుమతులు కల్పిస్తూ ప్రతిపక్ష పార్టీలు, నాయకుల పట్ల వివక్ష చూపుతున్నారు. జీవో నంబర్1 రద్దు కోసం భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిస్తున్నాం. - నెట్టెం రఘురాం, తెదేపా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు