The employees protested : సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్ తో ఏపీజేఏసీ అమరావతి చేపట్టిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఉద్యోగులు రెండో రోజు ఆందోళన చేశారు. భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి వారి కార్యాలయాల ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని వారు నినదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ న్యాయం చేయాలని వారు కోరారు.
ఏపీ పంచాయతీ రాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యాలయం వద్ద ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్యమ కార్యాచరణ నోటీసు ప్రకారం ముందుకు వెళ్తామని స్పష్టం చేసింది. ప్రభుత్వం తక్షణం తమకు చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను విశ్వసించే పరిస్థితుల్లో ఉద్యోగులు లేరని, ఈ నెల 20 తేదీ వరకూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆందోళన కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు.
ఆర్టీసీ హౌస్ లో...ఏపీ పీటీడీ ఉద్యోగులను ఏపీ జేఏసీ అమరావతి నేతలు కలిశారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ప్రభుత్వానికి నిరసన తెలియ చేసేలా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. 21 తేదీ నుంచి వర్క్ టూ రూల్ పాటించాలని స్పష్టం చేశారు.
మండిపడ్డ వామపక్ష నాయకులు... వైఎస్సార్సీపీ ప్రభుత్వం మోసపూరిత హామీలతో ఉద్యోగులను మోసం చేసిందని వామపక్ష నాయకులు మండిపడ్డారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు చేపట్టిన నిరసనలకు మద్దతుగా వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో ధర్నా చేశారు. కార్మిక, ప్రజాసంఘాలు మద్దతు పలికాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు సందర్భంగా ఉద్యోగులను మరోసారి మోసం చేసేందుకే ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తుందన్నారు. ప్రభుత్వ తీరుతో ఉద్యోగులు విసిగిపోయారని, ఇప్పటికైనా వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. లేదంటే ఉద్యోగులకు అండగా వామపక్ష పార్టీలు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాయని హెచ్చరించారు.
నెల్లూరులో...వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యోగులు, నిరుద్యోగులకు తీరని అన్యాయం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. ఉద్యోగ సంఘాలు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలకు మద్దతుగా నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ లో వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా ముఖ్యమంత్రి జగన్ నెరవేర్చలేదని ఈ సందర్భంగా శ్రీనివాసరావు అన్నారు. సీపీఎస్ రద్దు హామీని విస్మరించిన జగన్.. కనీసం జీతాలు కూడా సక్రమంగా ఇవ్వకుండా, బకాయిలను చెల్లించకుండా ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. నిరసన కార్యక్రమాలకు ఉద్యోగ సంఘాలు పిలుపునిస్తే తూతూమంత్రంగా చర్చలు జరిపి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరోసారి ఉద్యోగులను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పరిశ్రమల స్థాపన కోసం విశాఖలో రూ.13 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయంటూ మాయమాటలు చెబుతున్నారని, ఒప్పందాలన్నీ బోగస్ అని చెప్పారు.