AP Secretariat CPS Association : ప్రభుత్వం జమ చేయాల్సిన సీపీఎస్ వాటా మొత్తాలను ప్రాన్ ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేస్తూ సచివాలయ సీపీఎస్ ఉద్యోగులు వివిధ శాఖల కార్యదర్శులు, సీఎస్ జవహర్ రెడ్డికి విజ్ఞాపన పత్రాలు అందించారు. గడచిన 12 నెలలుగా ప్రభుత్వం సీపీఎస్ వాటా మొత్తాన్ని చెల్లించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ విజ్ఞాపన పత్రాలు ఇచ్చారు. ఏపీ సచివాలయంలోని 650 మందికి పైగా సీపీఎస్ ఉద్యోగులు ఆయా శాఖల ఉన్నతాధికారులకు ఎవరికి వారు విజ్ఞాపన పత్రాలు అందించారు.
12 నెలలుగా పెండింగ్... గడచిన 12 నెలలుగా తమ వాటా సీపీఎస్‌ను వేతనాల నుంచి తగ్గించి ప్రభుత్వం తన వాటాను జమ చేయకపోవడంపై ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మినహాయించిన సీపీఎస్ మొత్తాన్ని ఉద్యోగి వాటాతో కలిసి ప్రాన్ ఖాతాలకు జమ చేయాలని డిమాండ్ చేశారు. గడచిన 12 నెలలుగా 3 వేల కోట్ల రూపాయల మొత్తం ప్రభుత్వం పీపీఎఫ్ ఖాతాలో జమ చేయలేదని ఆక్షేపించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సీపీఎస్ ఉద్యోగులకు కేవలం 90 శాతం జీతాన్ని మాత్రమే చెల్లించి, మిగతా మొత్తానికి ఆదాయపు పన్ను కూడా వసూలు చేయడం అన్యాయమన్నారు.
కేంద్ర సంస్థలూ పట్టించుకోవడం లేదు... ఏపీ మినహా దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఉద్యోగుల ప్రాన్ ఖాతాలకు సీపీఎస్ మొత్తాన్ని జమ చేయకుండా దాచి పెట్టలేదని చెప్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు కుటుంబసభ్యులని చెప్పుకొచ్చే ప్రభుత్వం రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగులను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి కనీసం ఆ పథకం ద్వారా ఉద్యోగులకు చెల్లించాల్సిన డబ్బుల్ని కూడా జమ చేయకపోవడం శోచనీయమన్నారు. 12 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సీపీఎస్ వాటాలను చెల్లించకపోయినా కేంద్ర ప్రభుత్వం, ఆకౌంటెంట్ జనరల్ కార్యాలయం, పీఎఫ్ఆర్డీఏ సహా ఏ సంస్థలూ పట్టించుకోలేదని తెలిపారు. లోపభూయిష్టమైన సీపీఎస్ విధానం ద్వారా ఉద్యోగుల సామాజిక భద్రత ఆందోళనలో పడిందని పేర్కొన్నారు. సీపీఎస్ విషయంలో ప్రభుత్వమే ఉద్యోగులకు అన్యాయం చేస్తే పెన్షన్ ఇచ్చే ప్రైవేటు కంపెనీలు మోసం చేయడంలో వింతేముందని ప్రశ్నించారు. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు, ఏరియర్స్ తక్షణం చెల్లించాలని ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ అసోసియేషన్ కోరింది.