రైతులు ఖరీఫ్ సాగుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే కృష్ణా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షాలతో నారుమళ్లు కూడా వేస్తున్నారు. జిల్లా అధికార యంత్రాంగం ఖరీఫ్ రుణ ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. రూ.13,630 కోట్ల రుణాలు అందించాలని నిర్ణయించారు. పంపిణీ చేయనున్న రుణాల లక్ష్యాన్ని నూరుశాతం సాధించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాలకు చెందిన రైతులు ఏటా పంట పెట్టుబడుల నిమిత్తం రుణాల కోసం సహకారసంఘాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. పంట పెట్టుబడికి అవసరమైన రుణాలు అందించేందుకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఏటా రుణాలు అందిస్తోంది. 2017-18లో ఖరీఫ్, రబీ పంటలకు కలిపి రూ.8,813కోట్లు, 2018-19కి రూ.11,728 కోట్లు లక్ష్యం కాగా రూ.11,484కోట్లు పంపిణీ చేశారు. 2019-20కి రూ.12,196 కోట్లు కేటాయించగా రూ.12,175 కోట్ల రుణాలను అందించారు. ఈసారి గతంకంటే ఎక్కువ మొత్తం రుణాలు అందించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
రుణాలపంపిణీ సమీక్షలో పాల్గొన్న వివిధ శాఖల అధికారులు
పంట రుణాలతోపాటు వ్యవసాయ అనుబంధంగా ఎద్దులబండి, మేకలు, ఇతర పశువుల కొనుగోలు తదితరాలకు దీర్ఘకాలిక రుణాలు కూడా సక్రమంగా అందడంలేదు. దీంతో రైతులు కొన్ని పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న సంఘటనలు అనేకం. రుణం కోసం అర్హులకు అందించాల్సిన అవసరం ఉంది.
కౌలురైతులకు అందేనా?
జిల్లా వ్యాప్తంగా ఉన్న సాగుదారుల్లో ఎక్కువశాతం మంది కౌలు రైతులే. వీరంతా పంట పెట్టుబడి కోసం ఇంట్లో ఉన్న నగలు బ్యాంకుల్లో కుదువపెట్టి రుణం తెచ్చుకోవడం, లేదంటే వడ్డీ వ్యాపారులను ఆశ్రయించడం పరిపాటి. గతంలో కౌలు రైతు గుర్తింపు కార్డులు, సాగు ధ్రువీకరణ పత్రాలు అందించేవారు. ప్రస్తుతం దీనికోసం ప్రత్యేకంగా చట్టం చేసి పంట సాగుహక్కు పత్రాలు అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ పత్రాలు పొందడానికి కూడా భూముల యజమాని అంగీకారం అవసరం. దానికి యజమాని కూడా సంతకం చేసి ఇవ్వాలి. అక్కడక్కడ కొందరు యజమానులు మినహా ఎక్కువశాతం దానికి అంగీకరించడంలేదు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి అందరికీ రుణాలు ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.