Construction of Vijayawada Bypass : విజయవాడ బైపాస్ నిర్మాణానికి విద్యుత్ హై టెన్షన్ తీగలు అడ్డంకిగా మారాయి. 220 కేవీ, 330 కేవీ హై టెన్షన్ విద్యుత్ వైర్లు కిందకి వేలాడుతుండటంతో అక్కడ పని చేసేందుకు కార్మికులు భయపడుతున్నారు. హై టెన్షన్ వైర్లను తొలగించి పనులు పూర్తి చేయాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం ఉండటం లేదు. విద్యుత్ లైన్లు మార్చేందుకు స్థానికంగా రైతుల వద్ద నుంచి కొంత భూమిని సేకరించాల్సి ఉంది. తమకు సరైన పరిహారం ఇస్తేనే భూములు ఇస్తామని రైతులు అంటున్నారు. రైతులు కోరుతున్న పరిహారం తాము ఇవ్వలేమని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ హై టెన్షన్ వైర్లు రోడ్డుకు అడ్డుగా వస్తున్న కారణంగా ఆయా ప్రాంతాల్లో రహదారి నిర్మాణ పనులను గుత్తేదారులు నిలిపివేశారు. దీంతో విజయవాడ బై పాస్ నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు.
2021లో పనులు ప్రారంభం... గన్నవరం నియోజకవర్గంలోని చిన్న అవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు దాదాపు 30 కిలో మీటర్లనుమెదటి విడత ప్రాధాన్యతతో విజయవాడ బైపాస్ ను జాతీయ రహదారుల సంస్థ నిర్మాణం చేపట్టింది. 2021లో రహదారి పనులను గుత్తేదారు సంస్థలు ప్రారంభించాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రహదారి నిర్మాణం పూర్తి చేయాల్సి ఉన్నా ఇంకా 15 శాతం పనులు మిగిలాయి. నిర్మాణ జాప్యానికి హైటెన్షన్ విద్యుత్తు లైన్లు తొలగించకపోవడమే కారణంగా కనిపిస్తోంది. చిన్న అవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలో మీటర్ల మేర ఆరు వరుసలతో రహదారి నిర్మించాలి. రెండు పై వంతెనలు, రెండు ఆర్వోబీలు, 3 ప్రధాన వంతెనలు, 42 బాక్సు కల్వర్టులు, 4 కల్వర్టులు, 11 చిన్న వంతెనలు, 2 ట్రక్కు బేలను గుత్తేదారు సంస్థ నిర్మాణం చేస్తోంది. రెండు పైవంతెనలు పూర్తవగా రెండు ఆర్వోబీలు, 3 వాహనాలు వెళ్లే అండర్ పాస్లు, ఒక బాక్సు కల్వర్టు కట్టాలి.