Constable candidates: కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ప్రశ్నల్లో తప్పులున్నాయని 80 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర హోం శాఖ, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డులను పిటిషనర్లు ప్రతివాదులుగా చేర్చారు. బుక్లెట్ బిలోని 83, 113, 122, 133, 141, 182, 184 ప్రశ్నలపై నిపుణులతో నిర్ణయించేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్లు కోరారు. సదరు మార్కులు కలిపి, పరీక్షా విధానంలో ముందుకు కొనసాగేలా తమకు అర్హత కల్పించేలా ఆదేశాలివ్వాలని విజ్ఙప్తి చేశారు.
90శాతం హాజరు..:పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా జనవరి 22న నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నియామకాలకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష విజయవంతంగా పూర్తయ్యింది. కానిస్టేబుల్ పోస్టులకు మొత్తం 5.3 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 997 కేంద్రాల్లో ప్రాథమిక పరీక్ష నిర్వహించారు. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్ మనీశ్ కుమార్ సిన్హా.. విజయవాడలోని సిద్ధార్థ మహిళా కళాశాల పరీక్ష కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడుతూ.. రాత పరీక్షకు 90 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని వెల్లడించారు. అయితే, పరీక్షకు హాజరయ్యేందుకు ప్రభుత్వం విధించిన సమయపాలన నిబంధన అభ్యర్థులను ముప్పుతిప్పలు పెట్టింది. సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోలేక కొంతమంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. పరీక్షకు వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురైన ఓ మహిళా అభ్యర్థి.. రెండు నిమిషాలు ఆలస్యంగా రావడంతో ఆమెకు అనుమతి నిరాకరించారు. జిల్లా ఎస్పీని వేడుకున్నా.. ససేమిరా అనడంతో పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయింది.