CAG Report : 2022 మార్చి 31 తేదీతో ముగిసిన సంవత్సరానికి ఏపీ ఆర్థిక స్థితిగతులపై ఆడిట్ నివేదిక ను కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్ కార్యాలయం సమర్పించింది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, రెవెన్యూ, రవాణా తదితర అంశాలపై కాగ్ నివేదిక ఇచ్చింది. కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా వచ్చిన 6,356 కోట్ల రూపాయల గ్రాంట్ మురిగిపోయిందని నివేదికలో తెలిపింది. గత ఏడాది పోలిస్తే చెల్లించాల్సిన రుణాలు 24,257 కోట్ల రూపాయల మేర పెరిగిందని స్పష్టం చేసింది.
బడ్జెట్ లో చూపని అదనపు రుణాలు..బడ్జేటేతర రుణాలు 1,18,394 కోట్ల రూపాయలు నమోదయ్యాయి. డిస్కమ్ లకు, నీటి పారుదల ప్రాజెక్టులకు చెల్లించాల్సిన బకాయిలు మరో రూ.17,804 కోట్లుగా ఉన్నాయి. వీటినీ బడ్జెట్ లో చూపక పోవటంతో కీలకమైన మౌలిక సదుపాయల కల్పనా నిధుల పై శాసనసభ నియంత్రణ కోల్పోయేందుకు కారణమైందని నివేదికలో పేర్కొంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏపీ 18.47 శాతం జీఎస్డీపీ వృద్ధి రేటు నమోదు చేసింది. 2021 లో ఏపీ ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని సవరించింది. తద్వారా ఆర్థిక రుణ పరిమితి పెంచుకునే ప్రయత్నం జరిగింది. 688 కోట్ల రూపాయల రెవెన్యూ వ్యయాన్ని మూలధన వ్యయమని తప్పుగా వర్గీకరించారు. నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ గృహవసతి పథకాన్ని మూలధన వ్యయంగా ప్రభుత్వం చూపింది. లబ్ధిదారులకు ఇచ్చే ఇళ్లస్థలాలు, ఇళ్లను రెవెన్యూ వ్యయంగా చూపాల్సి ఉంది. బడ్జెట్ లో చూపని అదనపు రుణాలు పరిమితి కంటే అధికంగా ఉన్నాయని తెలిపింది.