‘‘వస్తున్నా మీకోసం’’ పాదయాత్ర తన జీవితంలో మరువలేని ఘట్టమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. వైకాపా పాలనలో ప్రజలకు వెలితి ఉందని.. గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూశామని.. వైకాపా లాంటి అరాచక పాలన ఎప్పుడూ చూడలేదన్నారు.
ఆ తెగువ అందరిలో రావాలి..
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడే తెగువ అందరిలో రావాలని పిలుపునిచ్చారు. "వస్తున్నా మీకోసం" పాదయాత్ర ప్రారంభించి 8 ఏళ్లు పూర్తైన సందర్భంగా పాదయాత్రలో పాల్గొన్న సహచరులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమాజం పట్ల బాధ్యతను గుర్తుకుతెచ్చిన ఆ పాదయాత్ర.. ఎనలేని సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
వారి కష్టాల నుంచే ఆ పథకాలు..
పాదయాత్రలో రైతుల కష్టాలు చూసే రుణమాఫీ అమలు చేయటంతో పాటు నదుల అనుసంధానం, నిరుద్యోగ భృతి, చంద్రన్న బీమా, అన్నా క్యాంటీన్లు వంటి పథకాలకు శ్రీకారం చుట్టామన్నారు. అభివృద్ది పనుల్లో పోటీబడే పాలకులను చూశాం కాని వాటిని నిలిపేసే ఉన్మాద పాలన మాత్రం ఇప్పుడే చూస్తున్నామని చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.