Private degree colleges : తాడేపల్లిలోని ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఫీజుల విషయంలో సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 10 విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలల యాజమాన్యాలు కమిషన్ కార్యాలయానికి చేరుకున్నాయి. విశ్వవిద్యాలయాల పరిధిలోనే డిగ్రీ కళాశాలల ఫీజులు నిర్ణయించాలని ఏపీ ప్రైవేటు డిగ్రీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ నిరసన తెలిపింది. ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ నుంచి ఫీజు విధానం తొలగించాలని డిమాండ్ చేశారు.
కమిషన్ కార్యాలయం వద్ద కళాశాల యాజమాన్యాలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరస్పరం వాగ్వాదం చోటు చేసుకుంది. సమస్యలు విన్నవించేందుకు ఐదుగురు సభ్యులను మాత్రమే పోలీసులు లోపలికి అనుమతించారు. గతంలోనే మా సమస్యలపై విన్నవించామని ఏపీ ప్రైవేటు డిగ్రీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కనుమర్ల గుండారెడ్డి తెలిపారు. తాము చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఫీజు రెగ్యులేటరీ కమిషన్ వచ్చాక వారి ఇష్టం వచ్చిన విధంగా నిర్ణయాలు చేస్తున్నారు... అసలు ప్రైవేటు డిగ్రీ కళాశాలలపై నిర్ణయం చేసే అధికారం వారికి లేదని ఏపీ ప్రైవేటు డిగ్రీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ కార్యదర్శి జె.రమణాజీ స్పష్టం చేశారు. యూనివర్శిటీలే మా ఫీజులు నిర్ణయం చేయాలని కోరుతున్నామన్నారు. ఏ,బీ,సీ కేటగిరీ తొలగించి రూ.20-30వేలు ఫీజుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. వీటిపై సానుకూలంగా స్పందన రాకుంటే భవిష్యత్తు కార్యాచరణ పై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.