Pattabhi Arrest: విజయవాడలో తెదేపా నేత పట్టాభి అరెస్ట్ - వైకాపా వర్సెస్ తెదేపా ఫైట్
22:47 October 20
అరెస్టుకు ముందు మీడియాకు వీడియో విడుదల చేసిన పట్టాభి
22:01 October 20
నా భర్తకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత: పట్టాభి భార్య
21:18 October 20
హైడ్రామా నడుమ పట్టాభి అరెస్ట్
తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను బుధవారం రాత్రి విజయవాడ పటమటలోని ఆయన ఇంటివద్ద పోలీసులు హైడ్రామా నడుమ అరెస్టు చేశారు. ముఖ్యమంత్రిపై పట్టాభి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బుధవారం ఉదయం నుంచీ ఆయన ఇంటివద్ద పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. అరెస్టు చేస్తారనే వార్తలు రావడంతో పట్టాభి బయటకు రాకుండా తన ఇంట్లోనే ఉండిపోయారు. ఒకవైపు పోలీసులు, మరోవైపు మీడియా, పార్టీ శ్రేణులు ఇంటి వద్దకు చేరుకోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తాము అరెస్టు చేయడానికి రాలేదని, మంగళవారం జరిగిన దాడిపై స్టేట్‌మెంట్ నమోదు చేసేందుకు వచ్చామని పోలీసులు తొలుత చెప్పారు. రాత్రి 8.30 సమయంలో పోలీసుల హడావుడి పెరిగింది. అదనపు బలగాలను దింపారు. రోప్ పార్టీ వచ్చి.. మీడియా, నాయకులను దూరంగా తీసుకెళ్లారు. 9 గంటలకు పోలీసులు ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ముందుగా ఇంటి ప్రధానద్వారాన్ని తెరిచేందుకు ప్రయత్నం చేశారు. సెంట్రల్‌లాక్ కావడంతో తెరుచుకోలేదు. ఇంటి వెనక్కి వెళ్లి వంటగది తలుపులు పగలగొట్టి 30మందికి పైగా పోలీసులు లోపలికి ప్రవేశించారు. పట్టాభిని అరెస్టు చేసి.. ఆయన భార్యకు నోటీసులు ఇచ్చారు. తెదేపా నేతలు, కుటుంబసభ్యులు అడ్డుకున్నా.. వారిని పక్కకు నెట్టి పట్టాభిని వాహనంలో ఎక్కించి తీసుకెళ్లిపోయారు. ఈ సంఘటనను కవర్ చేయకుండా మీడియాను దూరంగా పంపించారు. పట్టాభిని అరెస్టుచేసి రాత్రి 10 గంటలకు తోట్లవల్లూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు.
పలు సెక్షన్ల కింద కేసులు
ముఖ్యమంత్రి జగన్‌ను పరుష పదజాలంతో పట్టాభిరామ్ దూషించినట్టు గవర్నర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో కేసు నమోదైందని విజయవాడ పోలీసు కమిషనర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. బుధవారం రాత్రి పట్టాభిని అరెస్టుచేసినట్టు ప్రకటించారు. ఎవరు ఫిర్యాదు చేశారన్నది మత్రం వెల్లడించడం లేదు.
ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పలేదు: పట్టాభి భార్య
ఇంట్లోకి భారీసంఖ్యలో వచ్చిన పోలీసులు నా భర్తను బలవంతంగా తీసుకెళ్లారు. ఎఫ్‌ఐఆర్ కాపీ చూపించలేదు. నోటీసు మాత్రం ఇచ్చారు. ఎక్కడికి తీసుకెళుతున్నారో చెప్పలేదు. తలుపులు పగలగొట్టి లోపలికి వచ్చారు. నా భర్త ఆరోగ్యంగా ఉన్నారు. అలాగే తిరిగి రావాలి. ఆయనకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత. పోలీసులపై మాకు నమ్మకం లేదు. దీనిపై కోర్టుకు వెళ్తాం.
నా ఒంటిపై చిన్న గీతపడినా డీజీపీ, సీఎం బాధ్యత: పట్టాభి
‘నా ఒంటిపై ఒక్క గాయం కూడా లేదు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నాను. పోలీసు కస్టడీలో ప్రాణహాని తలపెట్టాలని చూస్తున్నారు. గతంలో ఎంపీ రఘురామకృష్ణంరాజును పోలీస్ కస్టడీలో ఏం చేశారో చూశాం. నా ఒంటిపై చిన్న గీతపడినా డీజీపీ, సీఎం బాధ్యత వహించాల్సి ఉంటుంది. రాష్ట్ర పోలీసులు, డీజీపీపై నాకు నమ్మకం లేదు...’ అని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్ పేర్కొన్నారు. అరెస్ట్ చేసే ముందు తీసిన వీడియోను పట్టాభి విడుదల చేశారు. అందులో అతని కాళ్లు, చేతులు, ఛాతి, వీపు, అరికాళ్లు సహా ఒంటిపై ఎక్కడా గాయాలు లేకపోవడాన్ని చూపించారు. ఈ సందర్భంగా పట్టాభి మాట్లాడుతూ.. ‘దేవాలయం వంటి పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు. భారత రాజ్యాంగం, న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. న్యాయబద్ధంగా పోరాటం కొనసాగిస్తాను. ఏదైనా జరిగితే డీజీపీ కోర్టులో జవాబు చెప్పాల్సి ఉంటుంది...’ అని హెచ్చరించారు.
ఇదీ చదవండి
SAJJALA ON CHANDRABABU: తెదేపా నేతలతో అలా మాట్లాడించింది చంద్రబాబే: సజ్జల