కృష్ణా జిల్లా పెదపారుపూడిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెదేపా బీసీ సెల్ నాయకుడు ఈశ్వరరావుపై దాడికి పాల్పడిన వైకాపా కార్యకర్తలు, మాజీ మంత్రి కొడాలి నాని పీఏ లక్ష్మోజీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెదపారుపూడి పోలీస్ స్టేషన్ ముట్టడికి తెదేపా శ్రేణులు యత్నించారు. ర్యాలీగా పోలీస్ స్టేషన్కు వెళ్తున్న తెదేపా శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తప్పు చేసిన వారిని అరెస్టు చేయమంటే తమను అడ్డుకోవడం ఏంటంటూ తెదేపా నేతలు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసేవరకు తాము వెనతిరిగేది లేదని పార్టీ శ్రేణులు రోడ్డుపై ధర్నాకు దిగారు. తెదేపా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, పామర్రు తెదేపా ఇంచార్జ్ వర్ల కుమార్ రాజా, ఇతర తెదేపా నాయకులను ఈడ్చుకుంటూ.. పోలీసులు వాహనాల్లోకి ఎక్కించారు. పోలీసులతో జరిగిన పెనుగులాటలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు గాయాలయ్యాయి. అరెస్టు చేసిన తెదేపా నేతలను పోలీసులు వివిధ స్టేషన్లకు తరలించారు. వైకాపా కార్యకర్తల చేతిలో దాడికి గురై, చావు బతుకుల మధ్య ఉన్న బీసీ నేత ఈశ్వరరావుకు న్యాయం చేయమని అడుగుతుంటే తమను అరెస్టు చేయడం దుర్మార్గమని నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ అక్రమాలకు ఇంతకంటే నిదర్శనం అవసరం లేదని విమర్శించారు.