ఎడతెరపి లేని వర్షాలు.. ఉద్ధృతంగా కొనసాగుతున్న వరద అన్నదాతలను నిండా ముంచేసింది. కౌలు తీసుకుని సాగు చేస్తున్న రైతులను వరుస విపత్తులు వెంటాడుతున్నాయి. ఈ ఏడాది ఐదుసార్లు వచ్చిన వరదతో పాటు.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు నీట మునిగాయి. చేతికొస్తుందనుకున్న ఉద్యాన పంటలు రోజుల తరబడి నీటిలో నానుతూ కుళ్లిపోతున్నాయి. అప్పులు చేసి పెట్టిన పెట్టుబడి కూడా రాని దయనీయస్థితిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కృష్ణా జిల్లాలో రెండు రోజులతో పోలిస్తే వరద తీవ్రత కొంచెం తగ్గడంతో పంట నష్టం తేలుతోంది. ముంపు ప్రభావిత ప్రాంతాలైన జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, విజయవాడ తూర్పు, పశ్చిమ, పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాల్లో ఇళ్లు, పొలాలు ముంపు నుంచి బయట పడుతున్నాయి. ఈ ఏడాది వరదకు అందరికంటే ఎక్కువగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడిని కోల్పోయారు. పంటలు కుళ్లిపోయి పనికి రాకుండా పోతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లంక గ్రామాలు ఇంకా నీటిలో మునిగే ఉన్నాయి. నివాస ప్రాంతాల్లో నీరు తగ్గినచోట ప్రజలు తమ ఇళ్లకు వెళ్తున్నారు. మిగిలిన వారు పునరావాస కేంద్రాలకే పరిమితమయ్యారు.