వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఆలయాలు కిక్కిరిశాయి. ఘంటసాల మండలం, శ్రీకాకుళం గ్రామంలో శ్రీకాకుళేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి మరియు ఉత్తర ద్వారా దర్శనములో భక్తులు వేలాదిగా పాల్గొన్నారు.
నూజివీడు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు ఉత్తర ద్వార దర్శనానికి పోటెత్తారు. ఆలయం వద్ద భక్తులు భౌతిక దూరం పాటించేలా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మాస్కులు ధరించిన భక్తులకు మాత్రమే ఆలయంలోకి ప్రవేశాలను కల్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు తీర్ధ ప్రసాదాలను అందజేశారు.
గరుడ వాహనంపై ఊరేగిన స్వామి వారు...
కృష్ణా జిల్లా మొవ్వ మండలం పెదముత్తేవి గ్రామంలో శ్రీ లక్ష్మీపతి స్వామి వారి దేవస్థానంలో అర్చకులు ఉదయం ఆరు గంటలకు ఉత్తరద్వార దర్శనాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తర ద్వారం వద్ద గరుడ వాహనంపై ఉభయదేవేరులతో స్వామి వారు దర్శనమిచ్చారు. వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారి గ్రామోత్సవం జరిగింది.