ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దుర్గ గుడి హుండిల లెక్కింపులో చేతివాటం... ఫిర్యాదు చేయని అధికారులు

దుర్గ గుడి హుండీల లెక్కింపులో సేవా సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. వారి వద్ద నుంచి ఎస్పీఎఫ్​ సిబ్బంది రూ. 60వేలు స్వాధీనం చేసుకున్నారు. ఇంత జరుగుతున్నా... దుర్గగుడి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. వారి వెనుక స్థానిక మంత్రి కార్యాలయంలో కీలక వ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది.

temple scam
దుర్గ గుడి హుండిల లెక్కింపు

By

Published : Dec 17, 2020, 2:08 PM IST

దుర్గగుడిలో హుండీల కానుకల లెక్కింపులో సేవా సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శించారు. ఇద్దరి వద్ద రూ.60వేల నగదును ఎస్పీఎఫ్‌ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా స్థానిక మంత్రి కార్యాలయంలోని కీలక వ్యక్తి ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. నగదు చోరీకి సంబంధించిన ఎలాంటి ఫిర్యాదు రాలేదని వన్‌టౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. గతంలో కానుకల లెక్కింపులో చేతివాటం ప్రదర్శించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే... అరెస్టు చేశారు. బుధవారం చోటుచేసుకున్న ఈ వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా సర్దుబాటు చేసేందుకు యత్నించినప్పటికీ వెలుగు చూసింది. అమ్మవారి వెండి రథంపై సింహాలు అదృశ్యమైన ఘటన తేలకుండానే.. సేవా సిబ్బంది చేతివాటం ప్రదర్శించిన వైనం చోటుచేసుకోవడం చర్చానీయంశంగా మారింది.

మల్లికార్జున మహా మండపంలో హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించేందుకు 200 మంది సేవా సిబ్బంది, 70మంది దేవస్థానం ఉద్యోగులు హాజరయ్యారు. ఈ లెక్కింపులో పాటించాల్సిన నిబంధనల ప్రకారం ఎస్పీఎఫ్‌ సిబ్బంది ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి లోపలికి పంపాలి. కానుకల లెక్కించే వారి వస్తువులు, బంగారం, నగదు రిజిస్టరులో నమోదు చేస్తారు. ఇదంతా తూతూమంత్రంగా జరగుతుండటంతో దేవస్థానం సిబ్బంది కంటే సేవా సిబ్బందే అధికంగా కానుకల లెక్కింపులో పాల్గొంటున్నారు. దేవస్థానం 5వేల మందికి సేవా సిబ్బంది పాస్‌లను ఇవ్వడం చర్చనీయాంశమయ్యింది.

తూతూ మంత్రంగా...

దుర్గగుడి హుండీల్లో భక్తులు సమర్పించే కానుకలు నెలకు రూ.3కోట్లు వరకు వస్తుంటాయి. ఇవికాక బంగారం, వెండి వస్తువులూ ఉంటాయి. ఎస్పీఎఫ్‌, సెక్యూరిటీ సిబ్బందికి ఏడాదికి రూ.కోట్లల్లో వేతనాలు రూపంలో దేవస్థానం చెల్లిస్తోంది. అయితే సరైన తనిఖీలు, పర్యవేక్షణ లేకపోవడంతో లెక్కింపులో చేతివాటం ప్రదర్శించిన ఘటనలు పునరావృతమవుతున్నాయి. వెలుగులోకి రానివి లెక్కేలేదు. లెక్కింపునకు దేవస్థానం ఉద్యోగలతోపాటు దేవాదాయ శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు తప్పని సరిగా హాజరు కావాల్సి ఉంటుంది. కానీ.. దేవాదాయ శాఖ నుంచి నామమాత్రంగా ఒకరు మాత్రమే వస్తున్నారు.

"సేవ చేసేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తుల వద్ద నగదును భద్రతా సిబ్బంది గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వారు చీటీ పాట కోసం నగదును తెచ్చుకున్నట్లు చెబుతున్నారు. కానుకల లెక్కింపునకు వ్యక్తిగత నగదు, విలువైన వస్తువులను రిజిస్టరులో నమోదు చేయించుకోకుండా రానందున.. ఆ నగదును హుండీల్లో వేయించాం"

- సురేష్‌బాబు, దుర్గగుడి ఈవో

ఇదీ చదవండి : 'రాజధానుల నిర్ణయంతో రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకం'

ABOUT THE AUTHOR

...view details