Chandrababu fire on Government : జీవో నంబర్ 1, ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామిపై దాడి విషయమై తెలుగుదేశం కార్యాచరణ ప్రకటించింది. ఈ విషయాలపై ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పర్యటనలు చేపట్టనున్నారు. జీవో నంబర్ 1 జారీ చేసిన ఈ ప్రభుత్వానికి సిగ్గు ఉందా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. అసెంబ్లీలో జరిగిన ఘటన చూస్తుంటే కోపం వస్తుందన్నారు. జీవో నంబర్ 1ను రద్దు చేయమని అడగడం తప్పా అని నిలదీశారు. ఆగస్టు సంక్షోభంలోనూ.. తెలంగాణ ఉద్యమం సందర్భంలోనూ.. సభలో ఎమ్మెల్యేలను కొట్టలేదని గుర్తు చేశారు. ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ జరగలేదన్న ఆయన... ఇవాళ ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన చరిత్రలో చీకటి రోజు అని వ్యాఖ్యానించారు. పెద్ద మనిషి బుచ్చయ్య చౌదరి మీదకు వస్తారా..? అని మండిపడ్డారు. స్వామి మీద చేయి వేయకుండా చూసుకోలేకపోయాననే బాధ తనకెప్పుడూ ఉంటుందన్నారు. వైఎస్సార్సీపీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
ఎవ్వరూ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి... ప్రతిపక్ష సభ్యులపై దాడులు చేయాలనే ఆలోచన తనకెప్పుడూ రాలేదన్నారు. బాబాయ్ గొడ్డలిపోటు, కోడి కత్తి డ్రామా తరహాలోనే ఇప్పుడు సభలో వైఎస్సార్సీపీ వ్యవహారం ఉందని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చింది చిన్న గాలే.. రాబోయేది సునామీ.. అని హెచ్చరించారు. ఇక్కడ ఎవ్వరూ శాశ్వతం కాదు.. కానీ, అసెంబ్లీ శాశ్వతమని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన సందర్భంలో మాట్లాడుకునే పరిస్థితి కూడా లేనప్పుడే.. ఎమ్మెల్యేలు విజ్ఞతతో వ్యవహరించారని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ 150 మంది ఉన్నారని.. మేం 20 మంది ఉంటే దాడి చేస్తారా అని ప్రశ్నించారు. సభలో మమ్మల్ని చంపేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ నిస్సహాయుడా అని విమర్శించారు. నేతల మీద దాడి.. ఆఫీసుల మీద దాడి.. ఇదేనా వైఎస్సార్సీపీ విధానం అని దుయ్యబట్టారు.