Telugu women protest on Social media posts: తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనితపై సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెడుతున్నారంటూ తెలుగు మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.మహిళల గౌరవాన్ని కాపాడాలంటూ సోమవారం ఇంద్రకీలాద్రి వద్ద విజయవాడ కనకదుర్గమ్మకు కొబ్బరికాయలు కొట్టారు. వైసీపీ నేతలు మహిళల జోలికొస్తే ఉపేక్షించమని చెప్పులు చూపిస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు.
వాసిరెడ్డి పద్మ స్పందించరా.. ముఖ్యమంత్రి, హోం మంత్రి, డీజీపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి పైశాచిక ఆనందం రోజురోజుకూ పెరిగిపోతోందని వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. భారతీరెడ్డిపై ఎవరో, ఏదో పోస్టు పెడితే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన వాసిరెడ్డి పద్మ ఇప్పుడెక్కడ అని నిలదీశారు. వైసీపీ పేటీఎం కుక్కలతో పెట్టించే పోస్టుల పట్ల పోలీసులుఎందుకు స్పందించరని మండిపడ్డారు. తనపై అసభ్య కథనాలు రాసిన వాడు ధైర్యముంటే తన ముందుకు రావాలని సవాల్ చేశారు. తనపై అసభ్య పోస్టులు పెట్టిన వాడి ఇంట్లో మహిళలు లేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సజ్జల భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలోనే.. ముఖ్యమంత్రి భార్య గురించి పోస్టు వస్తేనే పోలీసులు స్పందిస్తారా అని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ కుటుంబం, తమ కుటుంబాలపై ఎవరేం మాట్లాడినా పోలీసులకు పట్టదా అని నిలదీశారు. ఇకపై ఎవరు తప్పుడు పోస్టులు పెట్టినాచెప్పులతోనే సమాధానం చెప్తామని హెచ్చరించారు. భారతీరెడ్డి అనుచరుడు, సజ్జల కొడుకు భార్గవ రెడ్డి ఆధ్వర్యంలోనే మహిళల్ని కించపరుస్తున్నారని అనిత ఆరోపించారు.
తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత జగన్ మోహన్ రెడ్డి, భారతి రెడ్డి పైశాచిక ఆనందం రోజురోజకూ మితిమీరిపోతోంది. ప్రభుత్వ వైఫల్యాలు, ముఖ్యమంత్రి అసమర్థతపై ఎవరైనా విమర్శిస్తూ మాట్లాడితే వారిపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. టీడీపీకి చెందిన నాయకులైనా, మహిళలైనా సరే వారిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారు. వైసీపీ పేటీఎం కుక్కలచేత ఆర్టికల్స్ రాయించి సోషల్ మీడియాలో పెట్టించి పైశాచిక ఆనందం పొందుతున్నారు. భారతి రెడ్డిపై ఎవరో సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని వాసిరెడ్డి పద్మ స్పందించిన తీరు.. అందరి విషయంలోనూ అలాగే ఉండాలని అన్నారు. ఈ రోజు మాజీ ఎమ్మెల్యే, పొలిట్ బ్యూరో సభ్యురాలినైన నాపై జరుగుతున్న దాడిపై ఎందుకు స్పందించడం లేదు. పోలీస్ వ్యవస్థ అంతా కూడా అధికార పార్టీ నాయకులకు వంత పాడుతున్నారు. తల్లీ, చెల్లి విలువ తెలియని సీఎంతో చెప్పుకోవాలనుకోవడం మా దౌర్భాగ్యం. సీఎం, సీఎం భార్య గురించి ఎవరైనా మాట్లాడితే కేసులు పెడుతున్నారు.. సాటి మహిళలపైన కూడా అదే వైఖరి ఎందుకు చూపడం లేదు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చెప్పులతో కొట్టి బుద్ధి చెప్తాం. - వంగలపూడి అనిత, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు
నందిగామలో ఉద్రిక్తత.. తనపై అసభ్య పోస్టులు పెడుతున్నాడంటూ తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నేతృత్వంలో పెద్ద ఎత్తున తెలుగు మహిళలు నందిగామలోని కె. సజ్జనరావు ఇంటిని చుట్టుముట్టారు. సజ్జనరావు ఇంటి వద్దే మహిళలు నిరసనకు దిగారు. సజ్జనరావు ఇంట్లో లేకపోవడంతో.. అతని భార్య, తల్లికి అనిత, సౌమ్యకు పోస్టులు చూపించారు. అసభ్య పోస్టులు పెడితే సాటి మహిళలుగా ఎలా ఊరుకుంటున్నారంటూ నిలదీశారు. సజ్జనరావు రాతలు చూడడంటూ ఇంటి చుట్టుపక్కల మహిళలకు తెలుగు మహిళలు పోస్టులు చూపించారు. అసభ్య పోస్టులపై సజ్జనరావు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సజ్జనరావుకు ఫోన్ చేసి ఇంటి వద్దకు రావాలని వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. అది వేరే వ్యక్తి రాసిన పోస్టు అని, తనకు సంబంధం లేదని సజ్జనరావు తెలిపారు. రాసిన అతన్ని తమ వద్దకు తీసుకురావాలంటూ తెలుగు మహిళలు నిరసన కొనసాగిస్తున్నారు. సజ్జనరావు ఇంటి ముందు మహిళలు అతని ఫోటోలు తగలపెట్టారు.