కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ బిల్లులపై రైతన్నలు ఆందోళనతో ఉన్నారని తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డుల విధానం అంతమవుతుందని.. తమ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర లభించదనే భయం రైతుల్లో ఉందన్నారు. రైతులు తమ ఉత్పత్తులు అమ్ముకునే అంశంలో రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ కొరవడుతుందనే ఆందోళన వారిలో ఉందని అన్నారు. మార్కెట్ కమిటీలలో అటు కొనుగోలుదారులకు, ఇటు అమ్మకందారులకు మధ్యనుండే వ్యవస్థ ముగిసినట్టేనని అన్నదాతలు భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో రాష్ట్రం రైతు ఆత్మహత్యల్లో మూడోస్థానానికి చేరిందని విమర్శించారు. బిల్లులు లోపభూయిష్టంగా ఉన్నందున సరిచేయాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వం పైనే ఉందని అభిప్రాయపడ్డారు. బిల్లులు ప్రజామోదంగా ఉండాలని, రైతుల జీవితాలు మరింత పురోగతి సాధించేలా ఉండాలని తెలుగురైతు విభాగం తరపున ఆయన కోరారు.