నందమూరి తారక రామారావు.. తెలుగు ప్రజలకు పరిచయం అక్కరలేని పేరది. సినీ, రాజకీయ రంగాలను శాసించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దశ దిశలా వ్యాపింప చేసిన మహా నేత. తెలుగు నాట ప్రఖ్యాత నట సార్వభౌముడు ఎవరంటే ఎన్టీఆర్ (NTR) పేరు మినహా మరెవరి పేరు వినపించదు. కాలే కడుపులకు పట్టేడన్నం పెట్టలేని ప్రభుత్వాలు ఎందుకని ఆలోచించిన వాస్తవిక వాది. అందుకే సమాజమే దేవాలయం. ప్రజలే దేవుళ్లని నినదించారు. జనమే ఊపిరిగా రాజకీయాలు చేశారు. తెలుగుదేశం పార్టీ (TDP)ని స్ధాపించి దేశ రాజకీయాల్లోనే తొలిసారిగా సంక్షేమ రాజ్యానికి బాటలు పరిచారు.
13 నెలల్లోనే అధికారం..
రాజకీయాల్లోకి వచ్చి పార్టీ ప్రారంభించిన 13 నెలల్లోనే అధికారం చేపట్టి ముఖ్యమంత్రిగా రెండు రూపాయాలకే కిలో బియ్యం, పక్కా ఇళ్లు, జనతా వస్త్రాలు, మహిళలకు ఆస్తి హక్కు, ఇలా ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టారు. అనతి కాలంలోనే తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా లభించేలా అవతరింప చేసి, ఆ ఘనత పోందిన తొలి ప్రాంతీయ పార్టీగా చరిత్ర సృష్టించారు.
4 ఎన్నికల్లో 3 సార్లు అధికారం..
రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీఆర్‌ది ఒక శకం. అయన ప్రవేశం రాష్ట్ర ముఖ చిత్రాన్నే మార్చేసింది. జనంలో రాజకీయ చైతన్యానికి నాంది పలికింది. ఈ చైతన్యాన్ని నమ్ముకునే ఆయన తన రాజకీయ జీవితం చివరి వరకూ ధైర్యంగా నడవగలిగారు. అందుకే ఆయన పదమూడు ఏళ్ల రాజకీయ జీవితంలో నాలుగు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నారు. మూడుసార్లు విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు.
మహానాడు వేదికగా ఘన నివాళులు..
ఎన్టీఆర్‌కు ప్రజల పాలనే తప్ప ఎమ్మెల్యేల పాలన తెలియదు కనుకే ప్రజా సేవకుడిగా నిలిచారు. సినీరంగంలోనూ ఆ పేరు ఓ నట విశ్వరూపం. తెలుగు లోగిళ్లలో శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా చిరస్థాయిగా నిలిచిపోయే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఆయన. ఎన్నో విభిన్న పాత్రలకు జీవం పోసి రాష్ట్ర ప్రజల్లో చెరగని ముద్రవేశారు. నాలుగున్నర దశాబ్ధాల పాటు వెండితెర రారాజుగా నిలిచి 296 చిత్రాల్లో నటించారు. ఆ మహానేతకు మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ ఇవాళ ఘన నివాళులర్పించనుంది.