TDP chief Chandrababu Naidu Gudivada visited news: కోడి కత్తి కేసు 'పీకే ఆడించిన డ్రామా' అని తాను ఎప్పుడో చెప్పానని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఇప్పుడు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కూడా అదే విషయాన్ని తేల్చి చెప్పిందన్నారు. కోడి కత్తి దాడి, బాబాయి హత్యను ఎన్నికల్లో లబ్ధికోసం జగన్ వాడుకున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి తప్పులన్నీ చేసిన జగన్.. వాటి నుంచి రక్షణ కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారని దుయ్యబట్టారు. దేశంలోనే అత్యంత ధనవంతుడైన సీఎం.. మందబలం, ఆర్థిక బలం లేదని నంగనాచి కబుర్లు చెబుతున్నారంటూ చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.
'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన సభలో.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం వాళ్లే కోడికత్తి దాడి చేయించారంటూ నాటకాలాడి.. ఎన్నికల్లో లబ్ధి పొందారని ధ్వజమెత్తారు. నిందితుడు శ్రీనివాసరావుకు తెలుగుదేశంతో ఎలాంటి సంబంధం లేదని ఎన్‌ఐఏ కూడా స్పష్టం చేసిందంటే.. జగన్ ఎన్ని అబద్ధాలు చెప్పారో అర్థమవుతుందన్నారు. బాబాయిను ఎవరు హత్య చేశారో తెలిసినా కావాలనే తనపై బురదజల్లారని.. ఇప్పుడు కోర్టుల్లో వేర్వేరు పిటిషన్లు వేస్తూ రోజుకో రకంగా వివేకాను చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించిన జగన్.. తనకు భుజ బలం, అర్థ బలం లేదంటూ బీద అరుపులు అరుస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. అవినీతి సొమ్ములతో పత్రిక, ఛానల్ పెట్టిన జగన్.. మీడియా మద్దతు లేదంటూ చిలుక పలుకులు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి అబద్ధాల జగన్‌కు మరోసారి ఓట్లేస్తే.. ఇక రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరని చంద్రబాబు హెచ్చరించారు. దోచుకోవడం జగన్ మోడలైతే.. ప్రతి పేదవాడికి అండగా నిలబడాలన్నదే తన విధానమని చంద్రబాబు చెప్పారు. రాజకీయ భిక్షపెట్టిన పార్టీపైనే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విషం కక్కుతున్నారని.. ఇలాంటి వాళ్లకు ఎలా బుద్ధిచెప్పాలో తెలుసని చంద్రబాబు హెచ్చరించారు.