Nakka Anand babu : వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ తీరు అనుమానాస్పదంగా కన్పిస్తోందని తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. వైఎస్ వివేకా కేసులో సీబీఐకు చిత్తశుద్ధి ఉంటే అవినాష్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఇచ్చిన రిమాండ్ రిపోర్టులో అవినాష్ రెడ్డిని సీబీఐ సహ నిందితునిగా పేర్కొందని నక్కా గుర్తుచేశారు. సహ నిందితుడిగా పేర్కొన్న అవినాష్ ను అరెస్ట్ చేయకుండా విచారణకు పిలవడం ఏమిటని అని నిలదీశారు.
అవినాష్ రెడ్డికి అవకాశాలిస్తున్న సీబీఐ..అవినాష్ రెడ్డికి విచారణ నోటీసు ఇవ్వడం ద్వారా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించింది సీబీఐ కాదా అని ప్రశ్నించారు. అసలు అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై అప్పీలుకు వెళ్లాల్సిన సీబీఐ... ఆ పని ఎందుకు చేయలేదని మండిపడ్డారు. ఇప్పటికిప్పుడే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని నక్కా ధ్వజమెత్తారు. అవినాష్ అరెస్ట్ చేయడంలో జాప్యం జరిగితే ఏమైనా జరగొచ్చునని ఆరోపించారు. ఈ కేసులో విజయ్ కుమార్ లాంటి లాబీయిస్టులు, బ్రోకర్లు ప్రత్యక్షమవుతున్నారని తెలిపారు. సీఎం జగన్ వారితో గంటల తరబడి గడుపుతూ లండన్ పర్యటన కూడా రద్దు చేసుకున్నారని ఆక్షేపించారు. వివేకా కేసు విచారణలో ఏమైనా జరగొచ్చనే అనుమానం వస్తోందని, ఈ అనుమానాలకు సీబీఐ తెర దించాలని కోరారు.