ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Chandrababu fire on Jagan: 'నాలుగేళ్లలో 4 శాతమే ప్రాజెక్టుల పనులు.. సిగ్గనిపించడం లేదా జగన్' - chandrababu fire on jagan about projects

Chandrababu fire on Jagan: ప్రజా ద్రోహి జగన్ పాలనలో జలవనరుల ప్రాజెక్టులు పడకేశాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో 'పడకేసిన ప్రాజెక్టులు-ప్రజా ద్రోహి జగన్' పేరిట ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. కోస్తాంధ్ర పరిధిలో 96 ప్రాజెక్టులను ప్రీ క్లోజర్ చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు

By

Published : Jul 27, 2023, 4:30 PM IST

తెలుగుదేశం అధినేత చంద్రబాబు

Chandrababu fire on Jagan: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తాము నీళ్లు పారించి సిరులు పండిస్తే.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రక్తాన్ని పారిస్తోందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. మనీ మాఫియా పట్టిన వైసీపీ నేతలు ఉత్తరాంధ్రలోనే రూ.40వేల కోట్లు దోచేశారని ఆరోపించారు. అవినీతితో నేతలు పొట్టలు పెరిగాయే తప్ప ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తికాలేదని మండిపడ్డారు. ప్రజాద్రోహి జగన్ పాలనలో కోస్తాంధ్రలో జలవనరుల ప్రాజెక్టులన్నీ పడకేశాయంటూ చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

వైసీపీ హయాంలో రాష్ట్రంలో మొత్తం 198 జలవనరుల ప్రాజెక్టులు ప్రీక్లోజర్ చేస్తే అందులో 96ప్రాజెక్టులు కోస్తాంధ్రలో ఉన్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రాజెక్టు గేట్లకు కనీసం గ్రీజ్ కూడా ఈ ప్రభుత్వం పెట్టడం లేదని మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో పడకేసిన ప్రాజెక్టులు-ప్రజా ద్రోహి జగన్ పేరిట ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్​ ప్రదర్శించారు. ఉత్తరాంధ్రలో వైసీపీ నేతలు దోచిన 40వేల కోట్లు ఆ ప్రాంత ప్రాజెక్టులకు ఖర్చు పెడితే అవి పూర్తయ్యేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాద్రోహానికి పాల్పడితే జాతి క్షమించదని హెచ్చరించారు. సీఎం సహా మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు అవినీతిలో భాగస్వాములని ఆరోపించారు. జగన్ ఓ పక్క దోచుకుంటూ.. మరో పక్క పేదలకు పెత్తందారులకు పోరాటమనే స్లోగన్లు ఇస్తున్నాడని మండిపడ్డారు. ప్రాజెక్టులు పూర్తి చేస్తే పేదలకు మేలు జరగదా అని నిలదీశారు. ఈ ప్రభుత్వాన్ని శ్వేతపత్రం డిమాండ్ చేయటం కూడా అనవసరమని విమర్శించారు.

కిమ్​కు సోదరుడిలా వ్యవహరిస్తూ నవ్వినా, ఏడ్చినా జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని హింసిస్తున్నాడని చంద్రబాబు ఆక్షేపించారు. చెత్త ప్రభుత్వంతో వనరులు దోపిడీ చేస్తూఆదాయానికి గండికొడుతున్నారని దుయ్యబట్టారు.జలవనరుల మంత్రి అంబోతులా అరవటం తప్ప ఇంకేం చేస్తాడని మండిపడ్డారు. కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చొపెట్టినట్టే మంత్రి తీరు ఉందని విమర్శించారు. పోలవరం కుడి కాల్వ మట్టిని కూడా వైసీపీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు. పోలవరం కాల్వలనూ దోచేస్తూ.. తీవ్ర తప్పిదాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ప్రాజెక్టుల నిర్మాణ పనులు జరగకపోవడం వల్ల చెట్లు మొలుస్తున్నాయన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి రూ.780 కోట్లు కేటాయించి.. 5 కోట్లు ఖర్చు పెడతారా అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్జీటీ క్లియరెన్స్, కోర్టుల్లో ఉన్న ప్రాజెక్టుల విషయంలో జగన్ ప్రభుత్వం సరైన వాదనలు వినిపించడం లేదని చంద్రబాబు విమర్శించారు. పులిచింతల గేట్లు కొట్టుకుపోతే కనీస మరమ్మతులు కూడా చేయట్లేదని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. వెలిగొండ టన్నెల్లో తవ్వే మట్టిని శ్రీశైలంలో పోయటం ప్రమాదకరమన్నచంద్రబాబు.., శ్రీశైలం ప్రాజెక్టుకు అది ముప్పేనని హెచ్చరించారు. సీమాంధ్ర ప్రాజెక్టులపై నిన్న తాను ప్రెస్ మీట్ పెడితే.. సీఎస్ హడావుడి సమీక్ష పెట్టారని విమర్శించారు. సీఎం జగన్, మంత్రి లేకుండానే ప్రాజెక్టులపై సమీక్షించి ఏం లాభమని ప్రశ్నించారు. ఈ ఏడాది చివర్లో ఏదో ఐదు ప్రాజెక్టులు ప్రారంభిస్తామని చెప్పిన సీఎస్... నిధులు కేటాయింపు లేకుండా ఎలా పూర్తి చేస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ఆ ప్రాజెక్టులను పూర్తి చేయగలరా అని నిలదీశారు. సీఎం, మంత్రులకు ఎలాగూ తెలీనప్పుడు సీఎస్ అయినా వారికి అర్థమయ్యేలా చెప్పాలని చంద్రబాబు హితవు పలికారు.

ఏపీలోని 69 నదు అనుసంధాన ప్రక్రియ పూర్తైతే.. నీటి సమస్యే ఉండదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళి ప్రధాన నదులని.. వీటి కింద అనేక నదులు ఉన్నాయని తెలిపారు. ఉత్తరాంధ్రలో నదులను అనుసంధానం చేసేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు చేపట్టామని గుర్తు చేశారు. వంశధార-గోదావరి నదులను అనుసంధానం చేయొచ్చని.. కానీ, జగన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కోస్తాంధ్ర ప్రాజెక్టులపై తెలుగుదేశం హయాంలో 21,442 కోట్లు ఖర్చు పెడితే... వైసీపీ కేవలం రూ.4375 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. తెలుగుదేశం హయాంలో మొత్తంగా 64 ప్రాజెక్టులు మొదలెట్టి 23 పూర్తి చేశామని గుర్తు చేశారు. 32 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, కొత్తగా 7 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించామన్నారు. నాలుగేళ్లల్లో 4 శాతం ప్రాజెక్టు పనులే చేయటం సిగ్గనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగుదేశం అధికారంలోకి రాగానే ప్రాజెక్టులను కాలపరిమితి పెట్టుకుని పని చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్ బటన్ నొక్కితే అమ్మఒడి వెళ్తోందా అని నిలదీశారు. రూ.13 వేలు ఇస్తున్నామంటూ బటన్ నొక్కి, 5 వేలు మాత్రమే వేశారని మండిపడ్డారు. జగన్ నొక్కేది ఉత్తుత్తి బటనేనన్న చంద్రబాబు.., అసలు బటన్ సాయంత్రం తాడేపల్లి ప్యాలెస్సులో నొక్కుతాడని దుయ్యబట్టారు. జగన్‌కు ఉన్న డబ్బు ఆశతో.. ప్రతి రోజూ తాడేపల్లి కొంపకు డబ్బులు రావాల్సిందేనని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యంపై రేపు ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు చంద్రబాబు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details