Chandrababu naidu fire on YSRCP : లగ్నం పెట్టుకుందాం.. తాడోపేడో తేల్చుకుందాం.. ధైర్యం ఉంటే పోలీసులు లేకుండా సైకోని కూడా తీసుకురండి.. అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు వైఎస్సార్సీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దొంగ దెబ్బలు, దొంగాటలు వద్దని హితవు పలికారు. వైఎస్సార్సీపీ మూకల దాడిలో ధ్వంసమైన గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కాలిపోయిన, ధ్వంసమైన కార్లను చూసి దాడి జరిగిన తీరును చంద్రబాబు ప్రత్యక్షసాక్షులను అడిగి తెలుసుకున్నారు.
వారు అసలు పోలీసులేనా.. పిచ్చి రౌడీ చేష్టలకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. గన్నవరం పాకిస్థాన్లో ఉందా..? తనను పర్యటించొద్దు అనడానికి పోలీసులెవ్వరని నిలదీశారు. చేసిన సిగ్గుమాలిన పనిపై పోలీసులు కుటుంబసభ్యుల వద్ద అయినా ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. ప్రజా ఉద్యమ రూపకల్పనకు ప్రజలే శ్రీకారం చుట్టాలని, రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం చేసే ఉద్యమంలో అంతా ఐక్యం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గన్నవరం పార్టీ ఇంచార్జి అర్జునుడు చావుబతుకుల మధ్య ఉంటే.. ఈ తరహా దాడి చర్యలను ఏ విధంగా సమర్థించుకుంటారని ప్రశ్నించారు.