Letter from TDP President Chandrababu : ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైఎస్సార్సీపీ పార్టీ వ్యవహరిస్తోంది.. తమ పార్టీ అభ్యర్థి విజయం కోసం అడ్డదారులు తొక్కుతోంది.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అధికారులతో కుమ్మక్కై పెద్ద ఎత్తున నకిలీ ఓటర్లను చేరుస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అనర్హులను చేర్చినట్లు ఎన్నికల కమిషన్‌కు పలు రాజకీయ పార్టీల నాయకులు ఫిర్యాదు చేయడం విదితమే. అందుకు పలు సాక్ష్యాధారాలను కూడా జతచేశారు.
చంద్రబాబు ఫిర్యాదు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు, అక్రమాలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. వైఎస్సార్సీపీ నేతలతో పలు చోట్ల ఎన్నికల అధికారులు కుమ్మక్కుతో పెద్ద ఎత్తున బోగస్ ఓట్ల నమోదు అయ్యాయని అని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో పట్టుబడిన బోగస్ ఓట్ల వివరాలను లేఖకు జత చేశారు. బోగస్, నకిలీ ఓట్లను ఓటర్ల జాబితాలో చేర్చడం వల్ల ఎన్నికల ప్రక్రియ అపహాస్యం అవుతోందని మండిపడ్డారు.
మళ్లీ అదే తంతు.. గతంలో తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లో కూడా బోగస్ ఓట్ల తంతు నడిచిందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నేడు అదే పునరావృతం అవుతోందని చంద్రబాబు దుయ్యబట్టారు. డిగ్రీ చదవని వ్యక్తులు, నకిలీ సర్టిఫికెట్లతో ఓటర్లుగా నమోదు చేయబడ్డారని ఆక్షేపించారు. తప్పుడు చిరునామాలతో వైఎస్సార్సీపీ అభ్యర్థికి అనుకూలంగా పెద్ద సంఖ్యలో ఓటర్లను చేర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.