chandrababu naidu fire on jagan Government : ముస్లింలపై జగన్ ప్రభుత్వం కక్ష కట్టిందని, ముస్లింలపై దాడులు పెరిగాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వేధింపుల కారణంగా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉర్దూను రెండో అధికార భాషగా చేసిన ఘనత టీడీపీదే అని తేల్చిచెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ సమీపంలో చంద్రబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ముస్లిం మైనార్టీలు పెద్దఎత్తున హాజరయ్యారు. ఇఫ్తార్ విందు కార్యక్రమంలో షరీఫ్, ఫరూఖ్, నాగుల్ మీరా తదితర నాయకులు పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నమాజ్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లింలతో ఉపవాస దీక్షను చంద్రబాబు విరమింపజేశారు.
టీడీపీ హయాంలో మత సామరస్యం... రంజాన్ అంటే క్రమశిక్షణ, దాతృత్వం, ఉదారమైన స్వభావాల మేలు కలయిక అని అన్నారు. హైదరాబాదులో మత కలహాలను అణచి వేసి.. మత సామరస్యాన్ని తెలుగుదేశం కాపాడిందని తెలిపారు. ముస్లిం మైనార్టీల్లోని పేదలను ఆదుకునేందుకు మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ ఏర్పాటు చేసింది ఎన్టీఆర్ అని చెప్పారు. వేరే రాష్ట్రాల నుంచి కాకుండా హజ్ హౌస్ నిర్మించి హైదరాబాద్ నుంచే హజ్ యాత్రకు పంపే ఏర్పాట్లు చేసిందన్నారు. 2014 తర్వాత విజయవాడ, కర్నూల్లో హజ్ హౌస్ లు నిర్మించామని, కర్నూల్లో ఉర్దూ యూనివర్శిటీ పెట్టామని వివరించారు.