TS Police Jobs Events Techniques: తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ నియామక ప్రక్రియలో తొలిఅంకమైన ప్రాథమిక రాతపరీక్ష (పీడబ్ల్యూటీ) ఫలితాల వెల్లడితో అభ్యర్థులు శారీరక సామర్థ్య పరీక్ష (పీఈటీ)లపై దృష్టిసారించారు. గతంతో పోలిస్తే ఈసారి పీఈటీ పరీక్షల్లో మార్పులు చేయడంతో ఆయా అభ్యర్థులు మరింతగా చెమటోడ్చాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ మేరకు సాధన చేసినవారే కొలువును సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. సివిల్ పోలీస్ అభ్యర్థులతో పోలిస్తే సాయుధ, ప్రత్యేక పోలీస్ బలగాల్లో పోస్టులకు పోటీపడుతున్న అభ్యర్థులకు పీఈటీ పరీక్షలు కీలకం.
సివిల్ పోలీసు అభ్యర్థులు నిర్ణీత సమయంలో ఆయా ఈవెంట్లను పూర్తి చేస్తే పీఈటీలో అర్హత పొందుతారు. వీరికి తుదిరాత పరీక్షలో పీఈటీ మార్కులతో పనిలేదు. ఏఆర్ (సాయుధ), స్పెషల్ (ప్రత్యేక) పోలీస్ అభ్యర్థులకు అలా కాదు. ఎంత సమయంలో పూర్తిచేశారనే అంశాన్ని (మెరిట్) పరిగణనలోకి తీసుకొని మార్కులు కేటాయిస్తారు. తుది ఫలితాలకు ఈ మార్కులు కలుపుతారు. కాబట్టి వీరు సాధనపై పక్కాగా దృష్టి సారించాల్సిన అవసరముంది. ఈసారి మొత్తం 15,644 కానిస్టేబుల్ పోస్టుల్లో 4,423 సాయుధ, 5,010 ప్రత్యేక పోలీస్ పోస్టులుండటం విశేషం. అంటే 60 శాతానికిపైగా ఈ విభాగాల్లోనే ఉండటంతో పీఈటీ పరీక్షల సాధన విషయంలో వీరు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది.
పరుగు దూరం పెరిగింది..పీఈటీ ఈవెంట్లలో తొలుత పరుగు పందెంలో అభ్యర్థులు పాల్గొనాల్సి ఉంటుంది. నవంబరు చివర్లో లేదా డిసెంబరులో వీటిని నిర్వహించే అవకాశాలున్నాయి. మొత్తం మూడు ఈవెంట్లలో పరుగు పందెంలోనే కీలక మార్పులు చేశారు. గతంలో పరుగు పందెంలో ఉన్న దూరాన్ని ఈసారి పురుషులకు రెట్టింపు చేశారు. మహిళలకు ఎనిమిది రెట్లు పెంచారు. ఆమేర అభ్యర్థులు సాధనలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
* పురుష అభ్యర్థులు గతంలో 100 మీటర్ల పరుగును 15 సెకన్లలో.. 800 మీటర్ల పరుగును 170 సెకన్లలో పూర్తిచేయాల్సి వచ్చేది. ఈసారి ఈ రెండు ఈవెంట్లను తొలగించారు. వీటి స్థానంలో 1600 మీటర్ల పరుగును చేర్చారు. దీన్ని గరిష్ఠంగా 7 నిమిషాల 15 సెకన్లలో పూర్తిచేయాలి.