Cycling track in Hyderabad: తెలంగాణలో మరో వినూత్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు సిద్ధమవుతోంది. దేశంలో తొలిసారిగా హైదరాబాద్ అవుటర్ రింగ్‌రోడ్డు(ఓఆర్‌ఆర్)ను ఆనుకొని నిర్మిస్తున్న అతి పెద్దదైన అధునాతన సైక్లింగ్ ట్రాక్‌ను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిర్మాణ సంస్థను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. దీనిపై నిర్మాణ సంస్థ స్పందిస్తూ స్తంభాల వారీగా పనులు శరవేగంగా సాగుతున్నాయని పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియోను సైతం జత చేసింది. హామీ మేరకు నిర్మాణం వచ్చే వేసవి నాటికి పూర్తి కావాలని మంత్రి రీట్వీట్ చేశారు.
KTR Tweet on Cycling track in Hyderabad : సైక్లింగ్‌ను ప్రోత్సహించాలన్న దాని అభిమానుల విన్నపం మేరకు దక్షిణ కొరియాలోని సైక్లింగ్ ట్రాక్ ప్రేరణతో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ అనుబంధ విభాగం గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ద్వారా.. ఈ ఆరోగ్యదారి(హెల్త్‌వే) ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. దీనికి సెప్టెంబరులో కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ.95 కోట్ల వ్యయంతో 23 కిలోమీటర్ల పొడవు, 5.3 మీటర్ల వెడల్పుతో మూడేసి వరుసల్లో ప్రత్యేక ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. నానక్‌రామ్‌గూడ నుంచి తెలంగాణ పోలీసు అకాడమీ వరకు 8.5 కిలోమీటర్లు, కొల్లూరు నుంచి నార్సింగి వరకు 14.5 కిలోమీటర్ల మేరకు దీనిని నిర్మిస్తున్నారు. కొల్లూరు, నార్సింగి, నానక్‌రామ్‌గూడ, పోలీసు అకాడమీల నుంచి ఈ సైక్లింగ్ ట్రాక్‌కు దారులు ఏర్పాటు చేస్తున్నారు. దారి యావత్తు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది.