తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో గల జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు నియోజకవర్గాల పరిధి నుంచి మద్యం రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున రవాణా జరుగుతోంది. తెలంగాణలో తక్కువ ధరకు లభిస్తుండటంతో వ్యాపారులు భారీగా కొనుగోలు చేసి ఇక్కడికి తెచ్చి లాభాలు ఆర్జిస్తున్నారు. తెలంగాణలోని సూర్యాపేట, ఖమ్మం జిల్లాల నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాలకు మద్యం రవాణా జరుగుతుంది. పోలీస్, ఎస్ఈబీ విభాగం పలుమార్లు దాడులు చేసి పట్టుకుంటున్నా... మద్యం రవాణాను అడ్డుకోలేకపోతున్నారు.
ప్రధానంగా నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లోని పల్లెల్లో బెల్టు దుకాణాల్లో తెలంగాణ మద్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. ముఖ్యంగా అన్లాక్ ప్రక్రియ అనంతరం మద్యం విక్రయాలు ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలోని మధిర, కోదాడ, బోనకల్లు, వైరా, ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి మద్యాన్ని ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లలో, చివరికి చేపలు, కోళ్లు, గ్యాస్ సిలిండర్లు, పాల వాహనాలు, వాటర్ ట్యాంకుల ఇలా వివిధ రకాల వాహనాలను అక్రమ రవాణా చేసేందుకు వినియోగిస్తున్నారు. నందిగామ సబ్ డివిజన్ పరిధి సరిహద్దు ప్రాంతాల్లోని ప్రధాన రహదారుల్లో 26 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నా రవాణా ఆగకపోవడం గమనార్హం.
తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యం రవాణా చేసినా... అమ్మిన కఠిన చర్యలు తప్పవు. ఇప్పటికే పలు మార్గాల్లో చెక్ పోస్ట్లు పెట్టి తనిఖీలు చేస్తున్నాం. పట్టుబడితే కేసులు పెడుతున్నాం. తరచూ రవాణా చేస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఒక వ్యక్తికి తెలంగాణ నుంచి మూడు మద్యం సీసాలు మాత్రమే తెచ్చుకోవడానికే అనుమతి ఉంది. అతిక్రమిస్తే చట్టపరంగా శిక్షలు తప్పవు. -రమణమూర్తి, డీఎస్పీ నందిగామ