కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులు అక్రమమని.. రాష్ట్ర సాగునీటి సంఘాల సమాఖ్య ఆరోపించింది. ఆ నిర్మాణాలను తక్షణమే ఆపించాలని కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసింది. ఏపీ రైతుల హక్కులు కాపాడాలని విజ్ఞప్తి చేసింది. సీడబ్ల్యూసీ, కేంద్ర జలవనరుల శాఖ అపెక్స్ కౌన్సిల్, కృష్ణా నది యాజమాన్య బోర్డు (కెఆర్ఎంబీ) నుంచి అనుమతులు లేకుండానే పాలమూరు - రంగారెడ్డి, దిండి, భక్త రామదాసు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తున్నారని ఆరోపించింది.
ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడుతో ఏపీలో లక్షల ఎకరాల ఆయకట్టు బీడుగా మారుతుందని తెలిపింది. సాగర్ కుడికాల్వ కింద 11.74 లక్షల ఎకరాలు, ఎడమ కాల్వ కింద 15.71 లక్షల ఎకరాల బీడుగా మారే అవకాశం ఉందని లేఖలో సమాఖ్య ఆవేదన వ్యక్తం చేసింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యామ్‌లకు ఎగువన తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను ఆపి చట్టప్రకారం దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రైతుల హక్కులను కాపాడాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కోరింది. కేఆర్ఎంబీ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి తగిన ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.