దళిత సాధికారతను సాధించడానికి తెలంగాణ ప్రభుత్వం మిషన్ మోడ్‌లో పనిచేయడానికి నిశ్చయించుకుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అందుకు అఖిలపక్ష నేతలందరూ కలిసిరావాలని సీఎం కేసీఆర్ కోరారు. ఈ బడ్జెట్లో సీఎం దళిత సాధికారత పథకానికి వాస్తవానికి రూ.1000 కోట్లు కేటాయించాలనుకున్నాం.. కానీ వాటితో పాటు మరో రూ.500 కోట్లు పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాబోయే మూడు, నాలుగేళ్లలో 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఖర్చుచేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని వివరించారు. ఈ బడ్జెట్ ఎస్సీ సబ్‌ప్లాన్‌కు ఇది అదనమని పేర్కొన్నారు.
ప్రగతిభవన్‌లో సీఎం దళిత సాధికారతపై.. కేసీఆర్ సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. తనకు భగవంతుడిచ్చిన సర్వ శక్తులన్నీ ఉపయోగించి సీఎం దళిత సాధికారత పథకాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నానని అఖిలపక్ష నేతలతో సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
ఇన్నాళ్లు ఇలా.. ఇప్పుడు మరోలా..
రైతుబంధు పథకం, ఆసరా పింఛన్ల మాదిరి నేరుగా ఆర్థికసాయం అందే విధంగా... అత్యంత పారదర్శకంగా, దళారీలు లేని విధానం కోసం సూచనలు సలహాలు ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న నాయకులకు సీఎం కేసీఆర్ కోరారు. భూమి ఉత్పత్తి సాధనంగా ఇన్నాళ్లూ జీవనోపాధి సాగిందని... మారిన పరిస్థితుల్లో పారిశ్రామిక, సాంకేతిక తదితర రంగాల్లో దళిత యువత స్వయం ఉపాధి అన్వేషించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
భేటీ మధ్యలో 'గల్లీ చిన్నది' పాటను గుర్తుచేసుకున్న సీఎం..
దళితుల్లో అర్హులైన కుటుంబాల గణన జరపాలని.. అట్టడుగున ఉన్న వారి నుంచి సహాయం ప్రారంభించి వారి అభ్యున్నతిని సాంకేతిక విధానం ద్వారా నిత్యం పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్ అభిలాషించారు. అందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. ఈ సందర్భంగా గోరటి వెంకన్న.. గల్లీ చిన్నది.. పాటను సీఎం స్మరించుకున్నారు. మనసు పెట్టి వింటే దళితుల సమస్యకు ఆ పాటలో పరిష్కారాలు దొరుకుతాయని సీఎం అభిప్రాయపడ్డారు.
15 రోజులు ఎస్సీల భూముల గణన మీదే..
ఎస్సీలకు ఉన్న భూమి గణన చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశించారు. లెక్కలు స్థిరీకరించి సమగ్ర నివేదిక అందజేయాలని సూచించారు. 15 రోజులు ఎస్సీల భూముల గణన మీదే యంత్రాంగం పనిచేయాలని నిర్దేశించారు. ఎస్సీల కోసం చేపట్టాల్సిన కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం స్పష్టం చేశారు.
అసైన్డ్ భూములకు కూడా పట్టాభూముల ధరనే చెల్లిస్తున్నామన్న సీఎం.. గ్యారంటీ లేకుండానే ఎస్సీలకు బ్యాంక్ రుణాలు, ఆర్థికసాయం చేస్తామన్నారు. ఎస్సీ బిడ్డలు నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంచుకోవాలని.. అందుకు ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు.
పటిష్ఠంగా సీఎం దళిత సాధికారత..
గ్రామీణ, పట్టణ దళితుల సమస్యలను విడివిడిగా గుర్తించి పరిష్కారాలు వెతకాలని అఖిలపక్ష నేతలకు సూచించారు. దళితుల సామాజిక, ఆర్థిక సమస్యలను గుర్తించి సమష్టి కృషితో ఫలితాలు సాధించాలన్నారు. దళితుల అభ్యున్నతికి సీఎం దళిత సాధికారతను పటిష్ఠంగా అమలుచేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
సఫాయన్న నీకు సలాం..
సఫాయన్న నీకు సలాం అనే నినాదం తనదని సీఎం అన్నారు. సఫాయి కార్మికులు తల్లిదండ్రుల కన్నా ఎక్కువన్నారు. ఎవరూ అడగకుండానే ప్రతిసారీ సఫాయి కార్మికుల జీతాలు పెంచుతున్నామని చెప్పారు. వారికి ఉద్యోగ భద్రతతో కూడిన నిర్మాణాత్మక జీతభత్యాలు అందిస్తామని హామీ ఇచ్చారు.