Telangana Budget 2023-24 : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. కాళోజీ వాక్కులతో గవర్నర్ ప్రసంగం ప్రారంభించారు. ''పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది' అని కాళోజీ అన్నారు'' అంటూ తమిళిసై తన ప్రసంగం షురూ చేశారు. దాదాపు రెండేళ్ల తర్వాత గవర్నర్ ప్రసంగించారు.
Governor Speech in TS Budget 2023 : 'తెలంగాణ.. దేశానికి ఆదర్శంగా మారింది. ప్రజల ఆశీర్వాదాలు.. సీఎం నైపుణ్య పాలనతో రాష్ట్రాభివృద్ధి. ప్రజాప్రతినిధుల కృషి.. ఉద్యోగుల నిబద్ధత రాష్ట్ర ప్రగతికి కారణం. ఒకప్పుడు తెలంగాణలో విద్యుత్ కోతలు ఉండేవి. తెలంగాణలో ప్రస్తుతం నిరంతర విద్యుత్ అందిస్తున్నాం. దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ చేరింది. ఇంటింటికీ సురక్షిత జలాలు అందిస్తున్నాం. రాష్ట్ర పల్లెల రూపురేఖలు మారిపోయాయి. అత్యున్నత ప్రమాణాలతో గ్రామాలు ఆదర్శంగా మారాయి' అని గవర్నర్ అన్నారు.
Governor Speech in Telangana Budget 2023 : రాష్ట్రం పెట్టుబడుల స్వర్గధామంగా విలసిల్లుతోందని గవర్నర్ అన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రపంచం ప్రశంసలు అందుకుందని తెలిపారు. రాష్ట్రం ప్రగతి పథంలో ఎన్నో అవరోధాలను అధిగమించిందని చెప్పారు. ఎనిమిదిన్నరేళ్లలో దేశం నివ్వెరపోయే అద్భుతాలు ఆవిష్కరించిందన్నారు. 'కాళేశ్వరాన్ని రికార్డు సమయంలో నిర్మించాం. కాళేశ్వరం.. మహా అద్భుతంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. సాగు 20 లక్షల ఎకరాల నుంచి 73.33 లక్షల ఎకరాలకు పెరిగింది. త్వరలో కోటి ఎకరాలకు పైగా సాగునీరందిస్తాం. రైతుబంధు పథకం ప్రపంచవ్యాప్త ప్రశంసలు పొందింది. రైతుబంధు పథకాన్ని ఐరాసలోనూ ప్రశంసించారు. రైతు బీమా సదుపాయం ప్రపంచంలో మరెక్కడా లేదు. ధాన్యం ఉత్పత్తి 68.17 లక్షల టన్నుల నుంచి 2.02 కోట్ల టన్నులకు చేరింది. రైతు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది.' అని గవర్నర్ తమిళిసై అన్నారు.
"జీఎస్‌డీపీలో 18.2 శాతం వ్యవసాయ రంగం నుంచే వస్తోంది. విద్యుత్ సామర్థ్యం 7,778 మె.వా. నుంచి 18,453 మె.వా.కు పెరిగింది. ఫ్లోరైడ్ పీడ విరగడైందని కేంద్రమే పార్లమెంటులో ప్రకటించింది. దళితబంధు పథకాన్ని ఉద్యమ స్ఫూర్తితో కొనసాగిస్తున్నాం. వృద్ధాప్య పింఛన్ వయోపరిమితిని 57 ఏళ్లకు తగ్గించాం. ఎస్టీల రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతానికి పెంచాం. 2,471 తండాలకు పంచాయతీ హోదా కల్పించాం. గొల్ల, కురుమల కోసం 7.3 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ. మాంస ఉత్పత్తిలో దేశంలో ఐదో స్థానంలో ఉన్నాం. నేత, పవర్ లూమ్ కార్మికులకు చేతినిండా పని కల్పిస్తున్నాం. నేతన్నకు రూ.5 లక్షల జీవితబీమా అందిస్తున్నాం." - తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర గవర్నర్
Tamilsai speech in Budget sessions 2023 : గౌడ సోదరులకు వైన్ షాపుల కేటాయింపుల్లో 15 శాతం రిజర్వేషన్లు అందిస్తున్నామని గవర్నర్ అన్నారు. తాటి, ఈత చెట్లపై పన్ను రద్దు చేశామని తెలిపారు. లాండ్రీలు, సెలూన్లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు 19 నుంచి 310కి పెంచామని చెప్పారు. హైదరాబాద్‌లో బీసీ కులాల కోసం ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నామన్న గవర్నర్..ఆరోగ్యలక్ష్మి ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నామని వెల్లడించారు. ఆరోగ్యలక్ష్మి పథకాన్ని నీతిఆయోగ్ ప్రశంసించిందని గుర్తుచేశారు. అంగన్వాడీ టీచర్లకు దేశంలోనే అత్యధికంగా పారితోషికం చెల్లిస్తున్నామని వివరించారు. ఆశా వర్కర్ల పారితోషికం రూ.2 వేల నుంచి రూ.9,750కి పెంచామని గవర్నర్ తెలిపారు.
షీ టీమ్స్ పనితీరు అద్భుతం.. సివిల్ పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని గవర్నర్ తమిళిసై చెప్పారు. రాష్ట్రంలో షీ టీమ్స్ పనితీరు అద్భుతమని ప్రశంసించారు. తెలంగాణను ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాలు షీటీమ్స్ ఏర్పాటు చేస్తున్నాయని వెల్లడించారు. ఇప్పటివరకు 12.46 లక్షల మంది ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి అందించామన్న గవర్నర్..మైనార్టీల కోసం 203 గురుకుల కళాశాలలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రంజాన్, క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక కానుకలు అందిస్తున్నట్లు వివరించారు.