Teachers Protest: సమస్యల పరిష్కారం కోరుతూ ఫిబ్రవరి 15 నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల ఐక్యవేదిక నిర్ణయించింది. పట్టణాల్లో రౌండ్‌టేబుల్ సమావేశాలు, మండల కమిటీల ఏర్పాటు, మంత్రులకు వినతిపత్రాలతో పాటు అసెంబ్లీ సమావేశాల సమయంలో చలో విజయవాడ నిర్వహించాలని, మార్చి 28, 29 తేదీల్లో రెండు రోజులు సమ్మెకు వెళ్లాలని తీర్మానించింది. ఆదివారం విజయవాడలో జరిగిన ఐక్యవేదిక సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ‘రాష్ట్రంలో 2.40 లక్షల మంది ఔట్‌సోర్సింగ్, 60వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు చాలా ఏళ్లుగా ప్రభుత్వంలో సేవలందిస్తున్నారు. వీరికి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వేతనాలిస్తామని, కాంట్రాక్టర్లు లేని వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన హామీలను సీఎం జగన్ అమలు చేయాలి’ అని ప్రతినిధులు డిమాండు చేశారు.
పీఆర్సీలో వారికి న్యాయం చేయలేదు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీలో ఒప్పంద, కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయం జరగలేదు. ఎన్నికల సమయంలో కాంట్రాక్టు ఉద్యోగుల్ని పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చినా అమలు కాలేదు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైమ్‌స్కేల్ ఇస్తామని హామీ ఇచ్చినా.. వారి వేతనాలు నామమాత్రంగానే పెరిగాయి. ఏడుగురు పీడీఎఫ్, స్వతంత్ర శాసనమండలి సభ్యులమైన మేము వారికి మద్దతు ప్రకటిస్తున్నాం. - లక్ష్మణరావు, ఎమ్మెల్సీ, పీడీఎఫ్