కరోనా విపత్తుతో లక్షల మంది ప్రాణాలు కోల్పోతుంటే వైకాపా నాయకులు మాత్రం బ్లీచింగ్ పేరుతో నాసిరకం సున్నంను సరఫరా చేస్తూ.. కుంభకోణానికి పాల్పడ్డారని తెదేపా సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో నాసిరకం సున్నాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. వైకాపా ఆడిటర్ వేపల్లె శ్రీనివాసరావు, పిడుగురాళ్ల మాజీ జడ్పీటీసీ రామిరెడ్డి పిడుగురాళ్ల కేంద్రంగా క్వాలిటీ వెల్ కోటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బ్లీచింగ్ పౌడర్ కంపెనీ కాకపోయినప్పటికీ ఆ పేరు పెట్టుకొని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.
'బ్లీచింగ్ పేరుతో నాసిరకం సున్నం సరఫరా' - బ్లీచింగ్ పేరుతో నాసిరకం సున్నం వార్తలు
వైకాపా నాయకులు నాసిరకం సున్నాన్ని బ్లీచింగ్ పేరుతో సరఫరా చేస్తున్నారని తెదేపా సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస్ ఆరోపించారు. కరోనా విపత్తులో ఆదుకోవాల్సింది పోయి...ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.
వైకాపా అధికార ధనదాహానికి 5 కోట్ల ప్రజల ప్రాణాలను పణంగా పెట్టదల్చుకున్నారా అంటూ యరపతినేని ప్రశ్నించారు. ఈ మాఫియాను కేంద్రం సుమోటాగా తీసుకొని విచారణ చేపట్టాలని కోరారు. బిల్డ్ ఏపీ పేరుతో రాష్టాన్ని అమ్మే అధికారం జగన్‌కు ఎవరిచ్చారని యరపతినేని ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీలు భరించలేక ఫ్యాన్‌కు ఓటేసిన వారు కూడా.. ఇంట్లో ఫ్యాన్ వేయడానికి భయపడుతున్నారని ఎద్దేవాచేశారు. 150 రోజుల నుంచి రాజధాని అమరావతి రైతులు దీక్షలు చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా లేదని ఆయన మండిపడ్డారు.
ఇదీ చదవండి:రుతుపవనాలు ఈసారి 4 రోజులు ఆలస్యం