TDP state president Achchennaidu : బీజేపీ, వైఎస్సార్సీపీ మధ్య సంబంధం లేదని ప్రజలు అనుకోవాలంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడో.. సునీల్ ధియోధరో.. వేరెవరో అనుకుంటే ఫలితం లేదన్న ఆయన.. మనం చెప్పే మాటలను ప్రజలు నమ్మాలని హితవు పలికారు. వైఎస్సార్సీపీ-బీజేపీ మధ్య సంబంధం ఉందో లేదో ప్రజలకే తెలుసు అని పేర్కొన్నారు.
ప్రజలు అంతా గమనిస్తున్నారు..ఏప్రిల్ 1వ తేదీన కేంద్రం ఎఫ్ఆర్బీఎం లిమిట్స్ ఫిక్స్ చేస్తుందన్న అచ్చెన్న... జగన్ అదృష్టం కారణంగా అప్పులు.. ఎఫ్ఆర్బీఎం వెసులుబాట్ల విషయంలో ఏ రాష్ట్రానికి లేని అవకాశాలు ఏపీకే వస్తున్నాయన్నారు. ఏప్రిల్ నెలలో ఏపీకి ఇవ్వాల్సిన అప్పును మార్చి నెలలోనే వచ్చేలా చేయడాన్ని ప్రస్తావించారు. ఇలాంటివన్నీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇతర పార్టీలపై టీడీపీ విధానాన్ని పొలిట్ బ్యూరోలో చర్చించాకే నిర్ణయిస్తామని తెలిపారు.
భయంతో కూడిన మార్పు కనిపిస్తోంది..టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని అందరికీ అర్థమైందంటూ విజయసాయి ట్వీట్ పై అచ్చెన్నాయుడు స్పందించారు. చంద్రబాబును అవమానించిన నాయకులు.. అవహేళన చేసిన వారంతా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబును ఎవరు విమర్శించినా ప్రజలు ఛీ కొడుతున్నారన్నారు. ప్రజల్లో మార్పు చూసి.. వైఎస్సార్సీపీ నాయకుల్లో భయంతో కూడిన మార్పు వచ్చిందని తెలిపారు. వైఎస్ వివేకా హత్యపై జరుగుతోన్న చర్చను పక్క దారి పట్టించేందుకే.. విశాఖలో కాపురం అంటూ జగన్ వ్యాఖ్యలు చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.