mlc results : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై పార్టీ అధినేత చంద్రబాబు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎంకే మీనా, అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ ఫకీరప్పతో ఫోన్‌లో ఆయన మాట్లాడారు. అనంతపురం కౌంటింగ్ సెంటర్ లోకి ఎటువంటి పాసులు లేకుండా చొరబడి టీడీపీ వారిపై దాడులకు దిగిన వైఎస్సార్సీపీ శ్రేణులపై తక్షణ చర్యలకు చంద్రబాబు డిమాండ్ చేశారు. పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్ చివరి దశలో పెద్ద ఎత్తున అక్రమాలకు వైఎస్సార్సీపీ సిద్ధమైందని ప్రధాన ఎన్నికల అధికారికి చంద్రబాబు ఫిర్యాదు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో లోపాలు లేకుండా, కౌంటింగ్ సెంటర్ల వద్ద నిబంధనలు పూర్తిగా అమలయ్యేలా చూడాలని అధికారులను కోరారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలు, ఎన్నిక బాధ్యులను చంద్రబాబు ఆదేశించారు.
ఇవి సెమీఫైనల్.. ముఖ్యమంత్రికి కర్ర కాల్చి వాతపెట్టేలా పట్టభద్రుల తీర్పు ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ప్రజలు తిరగబడితే ఫలితం ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డికి ప్రత్యక్షంగా కనిపిస్తోందన్నారు. ప్రజాస్వామ్యం సిగ్గుపడేలా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరిగినా ప్రజలు తమ పక్షానే నిలిచారని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులని భావించి మూడు రాజధానులంటూ మోసగించే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఓడిపోతే మూడు రాజధానులకు ప్రజలు వ్యతిరేకం అనే భావన వ్యక్తమవుతుందని వైఎస్సార్సీపీ నేతలే ప్రచారం చేశారన్నారు. అభివృద్ధే తమ నినాదం అని ఉత్తరాంధ్ర ప్రజలు చాటి చెప్పారని అచ్చెన్నాయుడు తెలిపారు.
విశాఖలో 40వేల కోట్ల రూపాయల విలువైన భూములు వైఎస్సార్సీపీ కొల్లగొట్టిందని తాము చూపిన ఆధారాలను ప్రజలు నమ్మి ఓటు వేశారని చెప్పారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక కూడా గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అసంతృప్తిలో ఉన్న చాలా మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు.. తాజా పట్టభద్రుల ఫలితాలు చూసి అంతరాత్మ ప్రభోదానుసారం ఓటేయబోతున్నారన్నారు. రేపు జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఈ పట్టభద్రుల ఎన్నికలు సెమీఫైనల్ గా భావిస్తున్నామన్నారు. రేపు పులివెందులలో కూడా గెలవబోతున్నామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.