రైతుకోసం తెలుగుదేశం పోరుబాటు కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో రైతుల సమస్యలకు సంబంధించి తెదేపా ఓ వీడియోను విడుదల చేసింది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, అరకు, విశాఖ, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాల్లో జరగనున్న రైతు కోసం తెలుగుదేశం నాలుగో రోజు నిరసనలో భాగంగా ఆయా ప్రాంతాల రైతు సమస్యలను వీడియో ద్వారా వెల్లడించింది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో 115 మండలాలు ఉండగా, వాటిలో దాదాపు 80 మండలాల్లో తీవ్ర వర్షాభావం నెలకొందని వివరించింది. మొక్కజొన్న పంట బకాయిలు, జీడి రైతులకు మద్దతు ధర, వరి పంటతో కష్టాలు, నిబ్బరం కోల్పోయిన కొబ్బరి రైతు, తిత్లీ పరిహారం ఇంత వరకూ అందకపోవడం, రైతు గుండెల్లో విద్యుత్ మీటర్ల దడ, విత్తనాలు, ఎరువుల సమస్య, తదితర అంశాలపై నేడు తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాలు ఇవ్వనున్నారు.
2018 అక్టోబర్‌లో తిత్లీ తుపాను బీభత్సం సృష్టిస్తే తెదేపా ప్రభుత్వం కొబ్బరి చెట్టుకు 1500 చొప్పున, జీడిపంటకు హెక్టారుకు 30 వేలు చెల్లించిందని గుర్తుచేశారు. తాము అధికారంలోకి వస్తే తిత్లీ పరిహారం పెంచుతామని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి... కొబ్బరి చెట్టుకు అదనంగా మరో 1500, జీడి పంటకు అదనంగా మరో 20 వేలు పరిహారం ప్రకటిస్తూ 2019 సెప్టెంబర్ మూడో తేదీన జీవో జారీ చేసినా... ఇప్పటి వరకూ లబ్దిదారులకు పరిహారం చెల్లించకపోడాన్ని తెదేపా తీవ్రంగా తప్పుబట్టింది. శ్రీకాకుళం జిల్లాలో రబీ సీజన్‌లో 35 వేలకు పైగా ఎకరాల్లో మొక్కజొన్న వేస్తే.. క్వింటాలుకు 1850 రూపాయలకు ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉండగా... 1400 రూపాయలకు మించి కొనుగోలు చేయట్లేదని విమర్శించింది.