పరిషత్ ఎన్నికల రద్దుపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినందున ప్రభుత్వం మళ్లీ అప్పీల్‌కు వెళ్లటం తగదని అభిప్రాయపడ్డారు. హైకోర్టు ఉత్తర్వులపై అప్పీల్‌కు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎస్ఈసీ కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్య విజయం..
పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య విజయమని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ప్రభుత్వం ఇకనైనా పద్దతి మార్చుకుని చట్టానికి అనుగుణంగా వ్యవహరించాలని ట్వీట్ చేశారు.
వైకాపా పాలనకు చెంపపెట్టు..
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య గెలుపు అని తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు నరసింహ యాదవ్ అన్నారు. హైకోర్టు తీర్పు వైకాపా రాక్షస పాలనకు చెంప పెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. కోర్టు ధిక్కారాలకు, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడటం ప్రభుత్వానికి పరిపాటిగా మారిపోయిందని విమర్శించారు. కొత్త నోటిఫికేషన్ ఇచ్చి కేంద్ర బలగాల ఆధ్వర్వంలో ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
నిబంధనలు పట్టించుకోకుండా....
పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుని తెదేపా సీనియర్ నేత నక్కా ఆనంద్ బాబు స్వాగతించారు. సుప్రీంకోర్టు నిబంధనలు పట్టించుకోకుండా ఎన్నికలు నిర్వహించటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తూ కోర్టు కేసులకు ప్రజాధనాన్ని వృథా చేస్తోందని ఆరోపించారు.
ఇదీ చదవండి:'హైకోర్టు తీర్పు వైకాపా రాక్షస పాలనకు చెంపపెట్టు'