ఏటా జలహారతి మేమే నిర్వహిస్తాం! అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం తరఫున మూడేళ్లుగా జలసిరికి హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చిన తెదేపా ఈసారి పార్టీ తరఫున ఆ కార్యక్రమాన్ని నిర్వహించింది. కృష్ణా జిల్లాలో గోదావరి జలాలకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హారతి ఇచ్చారు.
ఆల్ అవుట్ దిశగా జగన్!
తెదేపా ప్రవేశపెట్టిన ఒక్కో సంక్షేమ పథకాన్ని తీసేస్తూ ఆల్‌అవుట్ దిశగా జగన్ ప్రభుత్వం వెళ్తోందని లోకేశ్ మండిపడ్డారు. ఇప్పటికే నిరుద్యోగ భృతి ఆపేసి, అన్నా కాంటీన్లను మూసివేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. పట్టిసీమ దండగ అని చెప్పిన జగన్ జలాలను చూసైనా రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్లలో 260 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణానదికి తరలించిన నాయకుడు చంద్రబాబు అని ఆయన అన్నారు.
అధికారంలోకి వచ్చాక జగన్ ఎన్నో యూటర్న్లు తీసుకున్నారని విమర్శించారు. 2014కు ముందు ఎరువులు, విత్తనాల కోసం రైతులు లాఠీ దెబ్బలు తినేవారని...ఇప్పుడు అదే పునరావృతం అవుతోందని దుయ్యబట్టారు.
దండగో..పండగో తెలుసుకోవాలి!
పట్టిసీమ దండగో పండగో పారుతున్న నీటిని చూసి జగన్ సమాధానం చెప్పాలని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. తెదేపా ఆవిర్భావం రోజునే పట్టిసీమకు శంకుస్థాపన చేసి 139 రోజుల్లో కృష్ణ-గోదావరి అనుసంధానం చేసిన నాయకుడు చంద్రబాబు అని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి వెళ్లాలి కాబట్టే ముందు రోజు పోలవరం పరిశీలనకు వెళ్లారని ఆరోపించారు.
పట్టిసీమే కారణం
అనుకున్న రేటును రైతులకు ఇప్పించి భూసేకరణకు ఒప్పించిన ఘనత చంద్రబాబుదేనని వల్లభనేని వంశీ గుర్తుచేశారు. ఒక్క రోజులోనే 720కోట్లు రైతుల ఖాతాల్లో జమయ్యేలా చేశారని, మెట్ట గ్రామాల చెరువుల్లో నీరున్నాయంటే పట్టిసీమే కారణమని అన్నారు. తాను సీఎం అయ్యానని జగన్ ఇంకా నమ్మలేకపొతున్నారని..అందుకే ఇంకా రావాలి జగన్, కావాలి జగన్ అంటున్నారని మాజీమంత్రి జవహర్ ఎద్దేవా చేశారు. శిలా ఫలకాలు ధ్వంసం చేయొచ్చు కానీ ప్రజల మనసుల్లో ఉన్న చంద్రబాబు ముద్రను ఎవరూ చెరపలేరని జవహర్ స్పష్టంచేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, బచ్చుల అర్జనుడు, దేవినేని అవినాష్, దేవినేని చందు తదితరులు పాల్గొన్నారు.