కేంద్రప్రభుత్వం చిరు వ్యాపారుల కోసం మే నెలలో ప్రవేశ పెట్టిన పథకాన్ని.. తానే కొత్తగా ఏదో చేస్తున్నట్లు గోరంత కూడా చేయకుండానే.. జగన్ కొండంత ప్రచారం చేసుకుంటున్నారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి మండిపడ్డారు. కేంద్రం ప్రకటించిన పథకాన్ని కబ్జా చేసి, దానికి అధికార పార్టీ రంగు లేసి ప్రచారం చేసుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. ప్రధాన మంత్రి స్వనిధి అనే పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించి, దానిలో భాగంగా 10 వేల రూపాయల వరకు చిరు వ్యాపారులకు తిరిగి చెల్లించేలా రుణం ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందని వివరించారు. కేంద్రప్రభుత్వ పథకాన్ని తనపథకంగా చెప్పుకుంటూ జగన్ మరోసారి అడ్డంగా దొరికిపోయారని పట్టాభి విమర్శించారు.
'కేంద్ర పథకానికి తను ప్రచారం చేసుకొని జగన్ అడ్డంగా దొరికిపోయారు'
రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది జగనన్నతోడు పథకం కాదు.. జగనన్నకబ్జా పథకమని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. జగనన్న తోడు పేరుతో మరో ప్రచారార్భాటానికి తెరలేపిన జగన్ ప్రభుత్వం.. వేలాదికోట్ల ప్రజల సొమ్ముని ప్రకటనల పేరుతో దుబారా చేస్తోందని ఆరోపించారు. జగనన్న తోడు పథకం పేరుతో ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనల్లోని అంశాలను చూస్తే, పక్కింట్లో పుట్టిన బిడ్డకు మనం నామకరణం చేసినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్