కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇవాళ మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం నివాసానికి వచ్చిన ఆయన... జగన్తో సుమారు అరగంటసేపు సమావేశమయ్యారు. వంశీ... మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలతో కలిసి సీఎం నివాసానికి వెళ్లారు. సీఎంతో వంశీ భేటీ కావడం వలన ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకుంది. పార్టీ మారే విషయంలోనే ముఖ్యమంత్రిని కలిశారా? లేక గన్నవరం నియోజకవర్గంలోని రాజకీయ పరిణామాలు, ఇటీవల వంశీపై నకిలీ పట్టాల వ్యవహారంపై కేసు నమోదు చేయడం గురించి చర్చించేందుకు కలిశారా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. భాజపా ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి విజయవాడ పర్యటనకు వచ్చిన ప్రతిసారి అతనితో వంశీ సమావేశం కావడం సర్వసాధారణమే. ఈ రోజు గుంటూరులో ఎంపీ సుజనా చౌదరి పర్యటన సమయంలో అతనితో సమావేశమయ్యారు. తర్వాత ఒకే కారులో ఇద్దరు కలిసి గుంటూరు నుంచి ఒంగోలు వెళ్లినట్లు తెలుస్తోంది. తెదేపా ఆధ్వర్యంలో ఇసుక కొరతపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పార్టీ అధిష్టానం పిలుపునిచ్చినప్పటికీ వంశీ గన్నవరం నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. తనపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని నిన్న గన్నవరం నియోజకవర్గంలో తెదేపా నేతలు, కార్యకర్తల సమావేశంలో వల్లభనేని తెలిపారు. సామాజిక మాద్యమాల్లో వంశీ పార్టీ మార్పుపై జోరుగా ఊహాగానాలు సాగిన తరుణంలో తాను అయ్యప్ప స్వామి మాలధారణలో ఉన్నానని, ఏ పార్టీలోకి వెళ్లడం లేదంటూ చెప్పుకొచ్చారు. అనూహ్యంగా వంశీ ముఖ్యమంత్రి జగన్‌ను కలవడం ఆసక్తికరంగా మారింది.
సీఎం జగన్తో తెదేపా ఎమ్మెల్యే భేటీ... అరగంటకుపైగా చర్చలు - Tdp mla vasmi meets jagan
సీఎం జగన్తో... తెదేపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం నివాసానికి వచ్చిన ఆయన.. జగన్తో అరగంటకుపైగా చర్చించారు.
సీఎం జగన్తో వల్లభనేని వంశీ భేటీ